dengue cases
Dengue Fever : దోమే కదా అనుకుంటే… శరీరాన్నే నిర్వీర్యం చేస్తుంది. రక్తాన్ని పీల్చడమే కాదు.. రక్తంలోని ప్లేట్ లెట్ లనూ లాగేస్తుంది. ఇది దేని గురించో అర్థమైంది కదా. ఇప్పుడు ఎటు చూసినా వైరల్ జ్వరాలే. అందులోనూ… ఈ సీజన్ లో అల్లకల్లోలం చేసే డెంగ్యూ మరింత ఎక్కువ. ఇదొకటే కాదు.. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా కూడా ఎక్కువే. వీటికి తోడు సాధారణ వైరల్ జ్వరాలు.
ఏ వైరల్ జ్వరమైనా లక్షణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కామన్ గా ఉంటాయి. ఇన్ ఫ్లుయెంజా వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల వచ్చే సాధారణ వైరల్ జ్వరం చాలావరకు డాక్టర్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కాని ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లను మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి.
అన్నీ వైరలే.. కానీ ఇవి ప్రమాదకరం
వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగ్యూ, చికున్గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది. మొదలైన రోజు నుంచీ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉంటుంది. చికున్గున్యా ప్రధాన లక్షణం ఒంట్లోని కీళ్లన్నీ నొప్పులుగా ఉండడం. ఈ నొప్పులు 10 రోజుల నుంచి 6 నెలల వరకూ ఉండొచ్చు.
READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !
ఇలా ఉంటే డెంగ్యూనే
డెంగ్యూ ఉన్నప్పుడు అయిదు రోజుల వరకు జ్వరం 101 నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది.
ఎముకలు విరిగినట్టు నొప్పులుంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు.
డెంగ్యూ ఉన్నప్పుడు శరీరంపై దద్దుర్లు కూడా రావొచ్చు.
దీన్నినిర్ధారించడానికి డెంగ్యూరాపిడ్డిటెక్షన్ టెస్టు, యాంటి జెన్ టెస్టు అనే ప్రత్యేక పరీక్షలు కూడా ఉన్నాయి.
డెంగ్యూ ఉన్నప్పుడు ప్లేట్ లెట్ కణాల సంఖ్య తగ్గినప్పుడు అది మరింత ప్రమాదకరం. ఇందుకోసం రక్తపరీక్షలు అవసరం.
READ ALSO : డెంగ్యూతో బాధపడేవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!
మలేరియా… డెంగ్యూ.. తేడా ఏంటి?
మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా లాంటి మహమ్మారి వ్యాధులు వ్యాప్తి చెందేది దోమల ద్వారానే. మలేరియా, డెంగ్యూ రెండూ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులే అయినా అవి వేర్వేరు దోమలు. మలేరియా అనాఫిలస్ దోమ ద్వారా వస్తే డెంగ్యూఏడిస్ దోమ వల్ల సంక్రమిస్తుంది.
మలేరియా దోమలు మురికి నీటిలో పెరిగితే, డెంగ్యూ దోమలు మంచి నీటి నిల్వల్లో పెరుగుతాయి.
మలేరియా దోమ రాత్రి కుడితే, డెంగ్యూ దోమ పగలు కుడుతుంది. అందుకే డెంగ్యూ దోమలతో మరింత జాగ్రత్తగా ఉండాలి.
నీటి నిల్వతో కూడిన కుండీలు, ట్యాంకులు మూతలు లేకుండా ఉంచితే డెంగ్యూ దోమలను పెంచుకున్నట్టే.
READ ALSO : Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి
డెంగ్యూ వస్తే….?
డెంగ్యూ లాంటి వైరల్ జ్వరాలకు నిర్దుష్టమైన చికిత్సలేమీ లేవు. లక్షణాలను తగ్గించే దిశగానే చికిత్స ఇస్తారు. డెంగ్యూ ఉన్నప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.
డెంగ్యూలో కనిపించే ప్రధానమైన కాంప్లికేషన్ రక్తంలో ప్లేట్ లెట్ కణాల సంఖ్య తగ్గిపోవడం. ఇవి రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు సహాయపడతాయి.ఇవి రక్తంలో ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తగ్గినప్పుడు దాత నుంచి సేకరించిన ప్లేట్ లెట్ కణాలను రోగికి ఎక్కిస్తారు. వీటి సంఖ్య 30 వేలు ఉన్నా రోగి పరిస్థితి విషమంగా ఉంటే కూడా ప్లేట్ లెట్లను ఎక్కించాల్సి వస్తుంది.