Preventing Infections : కానుకలుగా అందిన వస్తువులను అవి పాడవకుండా, ఎక్కువ రోజులు ఉండేలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మన ఈ శరీరం, మన జీవితం కూడా మనకు నేచర్ అందించిన కానుకలే. అలాంటి శరీరాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలే గానీ, దాని మన్నిక టైం కన్నా తొందరగా పాడైపోయేలా చేసుకోవడం అవివేకం కదా.
సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరమనే యంత్రాన్ని కండిషన్లో ఉంచుకోకపోవడం.. వెరసి అనారోగ్యాలు. హాస్పటల్ చుట్టూ పరుగులు. డాక్టర్ల చుట్టూ తిరగాలనే కోరిక, హాస్పిటల్ వాతావరణంలో ఎంజాయ్ చేసే తీరిక ఎవరికీ ఉండదు. వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలో కొన్ని సూచనలందిస్తున్నారు నిపుణులు.
చిన్న వయసు నుంచి పెద్దయ్యే వరకూ ఏమేం చేయాలో చూడండి.
పిల్లలు పుట్టగానే డాక్టర్లు సూచించిన అన్ని రకాల వాక్సిన్లూ తప్పనిసరి. పూర్తి డోసుల్లో వీటిని ఇప్పించడం మరవొద్దు.
ఆరో నెల వయసు రాగానే తల్లిపాలతో పాటుగా అదనంగా సాలిడ్ ఫుడ్ ని కూడా అలవాటు చేయాలి. ఈ వయసు నుంచే సరైన పోషకాహారాన్ని ఇస్తే వయసు పెరిగిన తర్వాత కూడా రోగాలు దరి చేరవు.
పిల్లలు మెదడుకు మాత్రమే కాదు.. శరీరానికి కూడా పని ఇచ్చేలా చూడాలి. చదువే కాదు.. ఆటపాటలు, వ్యాయామాలు వాళ్ల జీవితంలో భాగమవ్వాలి.
టీనేజి నుంచే ఇప్పటి పిల్లలు స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వ్యసనాల బారిన పడుతున్నారు. ఇప్పటి ఆధునిక పిల్లల్లో కొందరు డ్రగ్స్ లాంటివి కూడా వినియోగిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండాలి. రెగ్యులర్ వ్యాయామం చేయడానికి ప్రోత్సహించాలి.
ఈ మధ్యకాలంలో పిల్లలు, పెద్దవాళ్లు కూడా సెలవు రోజు వచ్చిందంటే ఆలస్యంగా ఏ సాయంత్రానికో స్నానం చేయడం లేదంటే అసలు చేయకుండా ఉండటం గమనిస్తున్నాం. దీనివల్ల అలర్జీలు, చర్మ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
వాకింగ్ ని రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేయాలి. లేకుంటే కండరాలు బలహీనమై, ఎముకలు పటుత్వం కోల్పోతాయి. చివరికి అవయవాలన్నింటికీ అవస్థలు తప్పవు.
వెస్ట్రన్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి పరవాలేదు. కానీ తరచుగా పిజ్జాలూ, బర్గర్లంటే మాత్రం ఆరోగ్యం హుష్ఫటక్. వీటిని వదిలి పండ్లు, కూరగాయల పైన ఫోకస్ చేయాలి.
కడుపులో ఆకలి కన్నా చాలామందికి నాలుకకే ఆకలెక్కువ. ఇలాంటప్పుడు మంచి నీళ్లు తాగడమో లేక పండో, కూరగాయల సలాడో తినాలి. దీనివల్ల అదనపు కేలరీలు చేరకపోవడమే కాకుండా, అవసరమైన పోషకాలు అందుతాయి.
వర్షం పడిందంటే చాలు… ఎక్కడ పడితే అక్కడ మురుగునీటి నిల్వలు, డ్రైనేజీ లీకేజీలు. వీటిపట్ల శ్రద్ధ తీసుకోవాలి. గవర్నమెంటు చర్యలు తీసుకోవడానికి ఆలస్యమైతే కాలనీ ప్రజలన్నాకలసికట్టుగాబాగుచేసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల సీజనల్ గా పెరిగే ఇన్ ఫెక్షన్లు, దోమల వ్యాధులనూ నివారించుకోగలుగుతాం.