Stomach Hurt : కడుపులో మంట బాధిస్తోందా?
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిక పొడిని పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్ రసాలు కడుపులో ఆమ్లాలను తగ్గించటం ద్వారా మంటను నివారించటంలో సహాయపడతాయి.

Stomach Hurt
Stomach Hurt : ఉరుకుల పరుగుల జీవితం, మారిన జీవనశైలి, పని వత్తిడి, మానసిక సమస్యలు, నెలసరి ముందు వచ్చే ఆందోళనలు ఫలితంగా చాలా మంది కడుపులో మంట సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు టీలు, కాఫీలు, ధూమపానం, పులుపు, ఉప్పు, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, సమయానికి తినకపోవటం వల్ల కడుపులో మంట సమస్యతో బాధపడుతున్నారు. మరికొంతమంది మాత్రం తలనొప్పి, కీళ్ల నొప్పికి కొలెస్ట్రాల్‌కి అధికంగా మందులు వాడినప్పుడు కడుపులో మంట సమస్య ఉత్పన్నం అవుతుంది.
కారంగా ఉండే ఆహారం, నూనెల్లో వేయించిన పిండి వంటలు, వేపుళ్లు కడుపులో ఆమ్లాలను పెంచుతాయి. దీని వల్ల మంట పుడుతుంది. వయసుతోపాటు ఎంజైములు తగ్గి ఆమ్లాలు పెరిగి కడుపులో మంట సమస్య వస్తుంది. ఉప్పు,కారం, మసాలాలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా సమస్య రాకుండా ముందస్తుగా జాగ్రత్త పడవచ్చు. కడుపులో మంట సమస్యతో బాధపడుతున్నవారు పాలు, పెరుగు, మజ్జిగ వంటివాటిని అధికంగా తీసుకోవటం వల్ల కొంతమేర ఉపశమనం పొందవచ్చు. టీ, కాఫీలను దూరంగా పెట్టాలి.
కడుపులో మంటకు ఆహారం అరగకపోవడం, మలబద్ధకం వంటివి కారణం కావచ్చు. ఆసమయంలో చేదు, పులుపుతో కూడిన తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నవారికి కడుపు మంట వస్తుంది. కడుపులో మంట ఉన్నసమయంలో గోరువెచ్చటి నీళ్లు తాగాలి. పప్పు దినుసుల ఆహారం తక్కువగా తినాలి. ఉడికిన కూరలను తినాలి. పుల్లటి పళ్లు, పులుసులు వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది.
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిక పొడిని పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్ రసాలు కడుపులో ఆమ్లాలను తగ్గించటం ద్వారా మంటను నివారించటంలో సహాయపడతాయి. అతిమధురం, నేల ఉసిరి, చిటికెడు చొప్పున పాలలో లేదా తేనెతోపాటు కలిపి తీసుకుంటే మంట తగ్గుతుంది. పచ్చి అరటిని ఎండబెట్టి పొడిగాచేసి పంచదార, చిటికెడు వాముపొడి కలిపి తినాలి. నేలవేము చూర్ణం, జాజికాయ చూర్ణం చిటికెడు చొప్పున తేనెలో కలిపి తీసుకున్నా మంట నుండి ఉపశమనం పొందవచ్చు. కడుపులో మంట ఉన్న సందర్భంలో వైద్యుల వద్దకు వెళ్ళి తగిన చికిత్స పొందటం మంచిది.