Ac Power
AC Power Saving: ఎండలు మండిపోతున్నాయి. గత 122 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ఎండ తీవ్రత ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వేడి తీవ్రతకు జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఎయిర్ కండిషనర్లతో ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. అయితే అదే పనిగా ఇంటివద్దనే ఉంటూ..ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు పెరిగిపోతుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సర్వీసింగ్ చేయించాలి:
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులుగా ఏసీలు ఉపయోగించి ఉండరు. ఇప్పుడు ఎండలు మండుతున్నాయని వెంటనే ఏసీ ఆన్ చేస్తుంటారు. అయితే అన్ని రోజులుగా వాడకపోవడం వలన ఫిల్టర్లలో, డక్ట్స్‌లో దుమ్ము, ధూళి పేరుకుంటాయి. అందుకే వెంటనే ఒకసారి ఏసీని సర్వీసింగ్ చేయిస్తే మంచిది. సర్వీసింగ్ చేయించడం వలన క్లీన్ అయిపోయి మంచి కండీషన్‌లో ఉంటుంది. దీంతో విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
Also read:Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు
ఏసీ ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచాలి:
గది త్వరగా చల్లబడాలని కొందరు అదే పనిగా ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఏసిని 16-18 డిగ్రీల మధ్య నడపడం వలన విద్యుత్ బిల్లు పెరగడం తప్పా, పెద్దగా ఫలితం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏసీని గరిష్టంగా 24-26 డిగ్రీల మధ్య ఉంచితే చల్లదనంతో పాటు, విద్యుత్ కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలం పాటు ఏసీ మన్నికను పెంచుతుంది.
అవుట్‌డోర్ యూనిట్‌కు ఎండ తగలకుండా చూడాలి:
నగరాల్లో అసలైన ఇరుకైన ఇళ్ల మధ్యలో ఏసీని పెట్టుకోవాలంటే అందరికి సాధ్యపడదు. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లో ఏసీ అవుట్ డోర్ యూనిట్ దాదాపు బయట, గోడకు బిగిస్తారు. అయితే ఎండ తగలడం వలన అవుట్ డోర్ యూనిట్ లో ఉండే కండెన్సర్ కాయిల్, కండెన్సర్ ఫ్యాన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎండ పడటం వల్ల గాలిని చల్లబరిచే ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. అవుట్ డోర్ యూనిట్ కు ఎండ తగలకుండా ఉండేందుకు వెనుక భాగానికి కొందరు దుస్తులు చుడుతుంటారు. ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read:Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు
సరైన ఏసీని ఎంపిక చేసుకోవాలి:
ఏసీ ఎంపిక సమయంలోనే కాస్త ఆలోచన చేస్తే విద్యుత్ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గది విస్తీర్ణాన్ని భట్టి ఏసీని ఎంపిక చేసుకుంటే మంచిది. ఏసీ ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే అంత మంచిదని భావిస్తుంటారు కొందరు. వాస్తవానికి మనం ఉండే గదిని భట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. గది విస్తీర్ణాన్ని భట్టి 1 టన్, 1.5 టన్, 2 టన్ సామర్ధ్యం గల ఏసీలు మార్కెట్లో ఉన్నాయి. వీటి కరెంటు వినియోగాన్ని భట్టి 2 స్టార్ నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది తయారీ సంస్థలు. ఇలా మన ఇంటిలోకి సరిపడే ఏసీని ఎంపిక చేసుకోవడం ద్వారా ఏసీ కొనుగోలు సమయంలోనూ, విద్యుత్ పరంగానూ డబ్బు ఆదా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
గాలి బయటకు వెళ్లకుండా చూడాలి, ఫ్యాన్ కూడా వేసుకోవాలి:
ఏసీ ఉన్న గదిలో నుంచి బయట గాలి లోపలకు లోపలి గాలి బయటకు పోకుండా చూడాలి. ఎందుకంటే బయట నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది. దీంతో ఆ గాలిని చల్లబరిచేందుకు ఏసీ మరింత ఎక్కువగా శ్రమ పడుతుంది. ప్రధానంగా దీనివల్లనే విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే చల్లగాలి బయటకు పోకుండా తలుపులు, కిటికీలు ఎప్పుడూ మూసే ఉంచాలి. ఇక ఏసీ ఉంది కదా అని కొందరు ఫ్యాన్ వేసుకోవడం మానేస్తారు. కానీ ఇది తప్పు. ఫ్యాన్ వేసుకుంటే గదిలో గాలి చలనం కలిగి గది త్వరగా చల్లబడి ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.
ఈ సూచనలు పాటించడం వలన ఎంతో కొంత విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు అంటున్నారు.
Also read:Haritha Haram : హరిత హారం మొక్కలు నరికేసిన మాజీ పోలీసు అధికారి..