HMPV Travel Insurance
HMPV Travel Insurance : విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ సహా ఇతర దేశాలకు నెమ్మదిగా వ్యాపిస్తోంది. చైనా, మలేషియా, హాంకాంగ్ ఇతర ఆసియా దేశాలలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళలను రేకిత్తించింది.
భారత్‌లో ఇప్పటికే అనేక హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ అధికారులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు హాలీడే సీజన్‌లో అంతర్జాతీయ ప్రయాణాల గురించి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అనేక దేశాలలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ల మధ్య ప్రజలు వారి విదేశీ పర్యటనల సమయంలో వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే.. ప్రయాణ బీమా ఎలా ప్రయోజకరంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Read Also : HMPV Outbreak : భారత్‌లో హెచ్ఎంపీవీ వ్యాప్తి.. దేశంలో ఈ వైరస్ నిర్ధారణ టెస్ట్ ధర ఎంత ఉంటుందంటే?
హెచ్ఎంపీవీ వైరస్ : ప్రయాణ బీమా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ చికిత్సను కవర్ చేస్తుందా? :
ప్రయాణ బీమా పాలసీలు సాధారణంగా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఆకస్మిక గాయాలు, అనారోగ్యాలకు సంబంధించిన చికిత్సలను కవర్ చేస్తాయి. ప్రజలు తమ పర్యటనలో హెచ్ఎంపీవీ, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు గురైనప్పుడు కూడా ఆర్థిక సాయం పొందవచ్చు. “మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లూ, హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లతో సహా ఊహించని అనారోగ్యాలు లేదా గాయాలకు సంబంధించిన వైద్య అత్యవసర పరిస్థితులు, చికిత్సలను కవర్ చేస్తుంది.
ఇందులో హాస్పిటలైజేషన్, సర్జికల్ విధానాలు, అత్యవసర వైద్య తరలింపులు ఉన్నాయి” అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేష్ జైన్ అన్నారు. ప్రయాణ బీమా ప్రయోజనాల కోసం పాలసీ జారీ సమయంలో బీమా సంస్థలు వినియోగదారులను ప్రీ-డీసీజెస్ (ఏదైనా ఉంటే) తప్పనిసరిగా ప్రకటించాలని జైన్ పేర్కొన్నారు. అయితే, ప్రయాణ బీమా పాలసీలు, వాటి కవరేజీ మారవచ్చు. అందువల్ల, ప్రయాణికులు తమ పాలసీని ఖరారు చేసే ముందు జాగ్రత్తగా అంచనా వేయాలి. సాధారణ అనారోగ్యాలు, సంభావ్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తున్నాయో లేదో ధృవీకరించడం చాలా ముఖ్యమని పాలసీబజార్‌లోని ట్రావెల్ ఇన్సూరెన్స్ హెడ్ మీట్ కపాడియా అన్నారు.
విదేశీ పర్యటనలో హెచ్ఎంపీవీ వైరస్ సోకితే ఏం చేయాలి? :
అనేక బీమా కంపెనీలు వినియోగదారులకు 24/7 సహాయాన్ని అందిస్తాయి. వారు తమ హాలిడే ట్రిప్‌ల సమయంలో ఆస్పత్రి గుర్తింపు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఖర్చులు, ఇతర సేవల కోసం అసిస్టెన్స్ కోసం వారి బీమా ప్రొవైడర్‌లను సంప్రదించవచ్చు. “మా పాలసీదారులు మార్గదర్శకత్వం, మద్దతు కోసం మా (24/7) ఎమర్జెన్సీ సహాయ బృందాన్ని సంప్రదించవచ్చు.
ఆస్పత్రిలో చేరే ఏర్పాట్లు, పేమెంట్లకు హామీ ఇవ్వడం, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం తరలింపు సహా వైద్య చికిత్సను అందించడంలో సాయం చేస్తాం. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం.. క్లెయిమ్‌లను మరింత ప్రభావవంతంగా ప్రాసెస్ చేసేందుకు ఇవి అవసరం కాబట్టి అన్ని మెడికల్ రికార్డ్‌లు, రసీదులను దగ్గర ఉంచుకోవడం చాలా కీలకం” అని రాకేష్ జైన్ అన్నారు.
HMPV Travel Insurance
అగ్రిగేటర్ ద్వారా ప్రయాణ బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల క్లెయిమ్ సమయంలో లేదా ప్రయోజనాలను పొందడంలో వ్యక్తులకు సహాయపడవచ్చు. “ప్రయాణికులు తమ బీమా సంస్థ లేదా పాలసీబజార్‌కు తెలియజేయడం ద్వారా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత సేవలను పొందవచ్చు. నగదు రహిత ఎంపికలు అందుబాటులో లేని అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మెడికల్ డాక్యుమెంటేషన్‌తో రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయవచ్చు” అని కపాడియా చెప్పారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇతర ప్రయోజనాలు ఏంటి? :
“మెడికల్ ఎమర్జెన్సీలతో పాటు, సమగ్ర ప్రయాణ బీమా పథకాలు ట్రిప్ జాప్యాలు, సామాను కోల్పోవడం, వైద్య తరలింపు ఇతర అంతరాయాలను కూడా కవర్ చేస్తాయి. ప్రయాణికులు అనేక రకాల ఆకస్మిక పరిస్థితులకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది” అని కపాడియా పేర్కొన్నారు.
హెచ్ఎంపీవీ లక్షణాలు, కారణాలు, నివారణ, చికిత్స :
ఈ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం మొదలైన సాధారణ ఫ్లూ-వంటి లక్షణాల మాదిరిగానే ఉంటాయి. కలుషితమైన ఉపరితలాలను తాకడం, గాల్లో శ్వాసకోశాలను పీల్చడం, సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం హెచ్ఎంపీవీ సంక్రమణకు కారణం కావచ్చు.
హెచ్ఎంపీవీ నివారణ కోసం ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. వైరస్ సోకితే, వ్యక్తి కోలుకోవడానికి 5 నుంచి 6 రోజులు పట్టవచ్చు. వైద్యులు సాధారణంగా ఇన్హేలర్ల వంటి ఓటీసీ మందులను సిఫార్సు చేస్తారు.