HMPV Outbreak : భారత్‌లో హెచ్ఎంపీవీ వ్యాప్తి.. దేశంలో ఈ వైరస్ నిర్ధారణ టెస్ట్ ధర ఎంత ఉంటుందంటే?

HMPV Outbreak : హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు తప్పనిసరి. బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన పద్ధతులు ఉన్నాయి. టెస్టు ధరల ఎంతంటే?

HMPV Outbreak : భారత్‌లో హెచ్ఎంపీవీ వ్యాప్తి.. దేశంలో ఈ వైరస్ నిర్ధారణ టెస్ట్ ధర ఎంత ఉంటుందంటే?

HMPV Outbreak

Updated On : January 7, 2025 / 9:51 PM IST

HMPV Outbreak : Test cost in Delhi Check rates : చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచ దేశాలకు కూడా నెమ్మదిగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా భారత్‌లో కూడా మంగళవారం (జనవరి 7) రెండు కొత్త హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరుకుంది. ఇటీవలి ఈ హెచ్ఎంపీవీ కేసులను నాగ్‌పూర్‌లో గుర్తించారు. గత సోమవారం బెంగళూరులో రెండు, అహ్మదాబాద్, చెన్నై, సేలంలలో ఒక్కొక్కటి చొప్పున వైరస్ కేసులు నమోదయ్యాయి.

Read Also : HMPV: భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్

హెచ్ఎంపీవీ (HMPV) అనేది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. ఈ వైరస్ సోకిన వారిలో సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, నాసికా రద్దీ వంటి తేలికపాటి లక్షణాలతో ఉంటుంది. చాలా మంది వ్యక్తులు విశ్రాంతి, తగినంత హైడ్రేషన్‌తో కోలుకోగలిగినప్పటికీ, హెచ్ఎంపీవీ వైరస్ శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీలో హెచ్ఎంపీవీ నిర్ధారణ టెస్టు ధరలివే :
హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు తప్పనిసరి. సాధారణంగా బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన పద్ధతులు అవసరమవుతాయి. ఒకే పరీక్ష ద్వారా హెచ్ఎంపీవీతో సహా ఇతర వ్యాధికారకాలను గుర్తించవచ్చు. భారత్‌లో అనేక ప్రైవేట్ ల్యాబ్‌లు ఈ పరీక్షను అందిస్తున్నప్పటికీ, సంబంధిత ఖర్చులు వేల రూపాయల వరకు ఉంటాయి.

దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్, టాటా 1ఎంజీ ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ల్యాబ్ వంటి ల్యాబ్‌లలో హెచ్‌ఎమ్‌పీవీ, హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఆర్‌టీపీసీఆర్‌ని గుర్తించే సాధారణ పరీక్షకు దాదాపు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చవుతుందని తెలిపింది.

పరీక్ష విధానం నాసోఫారింజియల్ స్వాబ్ / కఫం / BAL / ట్రాచల్ ఆస్పిరేట్ ద్వారా పరీక్షిస్తారు. అన్ని ముఖ్యమైన పరీక్షలతో కూడిన పూర్తి పరీక్ష, HMPV, Adenovirus, Coronavirus 229E, Coronavirus HKU1 మరికొన్ని పరీక్షలకు రూ. 20వేల వరకు ఖర్చవుతుంది.

దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి :
మొదటిసారిగా 2001లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే శ్వాసకోశ వ్యాధికారకం. ప్రధానంగా 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఎక్కువగా వ్యాప్తిచెందుతుంది. మెజారిటీ పిల్లల్లో ఈ వయస్సులోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్అనేది చల్లని వాతావరణ పరిస్థితులతో ముడిపడిన వైరస్ అని ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పినాకి ఆర్ దేబ్‌నాథ్ తెలిపారు. వైరస్ అనేది కొత్త దృగ్విషయం కాదని, వివిధ కారణాల వల్ల చల్లని వాతావరణ కాలంలో మళ్లీ పుంజుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు.

HMPV Outbreak

HMPV Outbreak

ఈ వైరస్‌ను శ్వాసకోశ ఆర్‌ఎన్‌ఏ (RNA) వైరస్‌గా అభివర్ణిస్తూ.. ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుందని డాక్టర్ దేబ్‌నాథ్ వివరించారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వైరల్ ఇన్‌ఫెక్షన్లు మరింత సులభంగా వ్యాప్తి చెందుతాయని, ముఖ్యంగా పెద్ద వయస్సులో ఉన్న వ్యక్తులలో సాధారణంగా 60 ఏళ్ల నుంచి 65 సంవత్సరాల కన్నా ఎక్కువ, 5 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన సూచించారు.

మానవ మెటాప్‌న్యూమోవైరస్ విలక్షణమైన లక్షణాలలో నాసికా రద్దీ, ముక్కు కారటం, ఎర్రటి కళ్ళు, గొంతునొప్పి వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. తీవ్రమైన సందర్భాల్లో, న్యుమోనియా వంటి లక్షణాలు బయటపడతాయి. శ్వాసకోశ సమస్యకు దారితీస్తుంది. మాక్స్ హెల్త్‌కేర్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ మోనికా మహాజన్ కూడా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ అనేది సాధారణ శ్వాసకోశ వైరస్ అని పేర్కొన్నారు. ఇది సాధారణంగా జలుబును పోలి ఉండే ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతుంది.

హెచ్ఎంపీవీ లక్షణాలివే :
ఆరోగ్యకరమైన పెద్దలలో హెచ్ఎంపీవీ సాధారణంగా గొంతు నొప్పి, నాసికా రద్దీ, దగ్గు, తక్కువ-స్థాయి జ్వరం వంటి సాధారణ జలుబును పోలి ఉండే తేలికపాటి లక్షణాలను కలిగిస్తుంది. అయినప్పటికీ, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ తగ్గిన వ్యక్తులు గురక, శ్వాసలోపం, న్యుమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండే జనాభాలో ముఖ్యంగా శిశువులలో, హై-పిచ్ శ్వాస, వేగవంతమైన శ్వాస, శ్వాస సమయంలో కనిపించే ఛాతీ కండరాల ఉపయోగం, సైనోసిస్ అని పిలిచే పెదవులు లేదా వేళ్లకు నీలిరంగు వంటి లక్షణాలు పెరుగుతాయి. సరైన చికిత్స లేకుండా, హెచ్ఎంపీవీ బ్రోన్కియోలిటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తుంది. తదుపరి సమస్యలను నివారించడానికి ముందస్తు వైద్యం తప్పనిసరిగా తీసుకోవాలి.

హెచ్ఎంపీవీ ట్రీట్‌మెంట్ ఏంటి? :
ప్రస్తుతం, హెచ్ఎంపీవీ చికిత్సకు నిర్దిష్ట యాంటీవైరల్ మందులు లేవు. చాలా మంది వ్యక్తులు కోలుకుంటున్నప్పుడు ఇంట్లో తేలికపాటి లక్షణాలను కలిగి ఉండొచ్చు. లక్షణాలు తీవ్రమై, తీవ్రంగా మారిన సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు. ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఈ కింది చికిత్సలను ఎంచుకోవచ్చు.

ఆక్సిజన్ థెరపీ : శ్వాస కోసం నాజల్ ట్యూబ్ లేదా మాస్క్ ద్వారా అనుబంధ ఆక్సిజన్ అందిస్తారు.
ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ : సరైన హైడ్రేషన్ కోసం (IV) ద్రవాలు ఇవ్వవచ్చు.
కార్టికోస్టెరాయిడ్స్ : వాపు తగ్గించి లక్షణాలను తగ్గించడానికి స్టెరాయిడ్స్ వినియోగించవచ్చు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివే :
హెచ్ఎంపీవీ వైరస్ బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైరస్ బారిన పడిన వ్యక్తులు ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. (WHO) మాజీ చీఫ్ సైంటిస్ట్, సౌమ్య స్వామినాథన్, హెచ్ఎంపీవీ భయాందోళన చెందాల్సిన వైరస్ కాదని పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం, లక్షణాలు తీవ్రమైతే వైద్య సలహా తీసుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని తగు జాగ్రత్తలను సూచించారు.

హెచ్ఎంపీవీ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించే నివారణ చర్యలు :

  • సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం లేదా కనీసం 60శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు.
  • శ్వాసకోశ లక్షణాలు కలిగిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం
  • రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించడం
  • వైరస్ ప్రభావిత ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తుండాలి.
  • శ్వాసలో గురక లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండటం, వెంటనే వైద్యున్ని సంప్రదించడం

Read Also : HMPV: హెచ్ఎంపీవీ వైరస్ గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు సూచించారంటే?