HMPV: హెచ్ఎంపీవీ వైరస్ గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు సూచించారంటే?

హెచ్ఎంపీవీ ఒక సంవత్సరం వయస్సు నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో వైరస్ లక్షణాలు తెలుసుకోవాలంటే..

HMPV: హెచ్ఎంపీవీ వైరస్ గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు సూచించారంటే?

HMPV

Updated On : January 7, 2025 / 3:13 PM IST

HMPV Cases In India: చైనాలో హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) విజృంభిస్తుంది. ఈ వైరస్ బారిన పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు హెచ్ఎంపీవీ గురించి భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, హెచ్ఎంపీవీ కేసులు భారత్ లోనూ నిర్దారణ అయ్యాయి. మంగళవారం ఉదయం వరకు దేశంలో ఏడు హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. అయితే, ఈ వైరస్ గురించి పెద్దగా భయపడాల్సింది లేదని, కానీ, వ్యక్తిగత శుభ్రతతోపాటు, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: HMPV: భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్

హెచ్ఎంపీవీ ఇన్పెక్షన్లకు ప్రత్యేక చికిత్స ఏమీలేదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తారు. జలుబు లక్షణాలు తగ్గటానికి యాంటీ హిసట్మిన్లు, జ్వరానికి పారాసిటమాల్ ఉపయోగపడతాయి. ఒకవేళ న్యుమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వైరస్ కొత్తదేమీ కాదు.. పాతదే. 2001లోనే దీన్ని నెదర్లాండ్స్ లో గుర్తించారు. ఇప్పుడు ఉన్నట్లుండి ఉధృతం కావటంతో కొవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు భయాందోళన చెందుతున్నాయి. అయితే, ఈ వైరస్ వల్ల పెద్దగా భయపడాల్సిన పనిలేదని, లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: HMPV News: హెచ్‌ఎంపీవీ వల్ల ఎవరెవరికి ముప్పు ఉంటుంది? చిన్నారులకు సోకితే ప్రమాదమా?

హెచ్ఎంపీవీని ఎలా గుర్తించాలి.. లక్షణాలు ఏమిటి?
♦  గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సాధారణ లక్షణాలతో కూడిన హెచ్ఎంపీవీ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత పెరిగితే నిమోనియా, బ్రోన్కియోలిటిస్ కు దారితీస్తుంది. అలాంటి సమయంలో ఆస్పత్రిలో చేరి తగిన చికిత్స తీసుకోవాలి. ఆక్సిజన్ థెరపీ కూడా అవసరం.

♦  హెచ్ఎంపీవీ ఒక సంవత్సరం వయస్సు నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో వైరస్ లక్షణాలు తెలుసుకోవాలంటే.. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు కలిగి ఉంటారు. కొన్నిసార్లు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో పీఐసీయూలో అధిక – ప్రవాహ నాసికా కాన్యులా ద్వారా లేదా సీపీఏపీ మిషన్ ద్వారా నిరంతర శ్వాస మద్దతు అవసరం అవుతుంది.

♦  హెచ్ఎంపీవీ ఎక్కువగా శిశువులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. వారిని నిత్యం పర్యవేక్షించడం ఎంతో అవసరం. ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.

♦  పెద్దవారికి అంటే 65ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో తరచుగా జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే హెచ్ఎంపీవీ సోకినట్లుగా భావించాలి.

♦  హెఎంపీవీ ఇతర శ్వాసకోశ ఇన్ఫక్షన్లు, ఆర్ఎస్వీ (రెస్సిరేటరీ సెన్సిటియల్ వైరస్) వంటి వాటితో కలిసిపోతుంది. ఇది శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు కలిగిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Also Read: హెచ్‌ఎంపీ వైరస్‌ను మొదటిసారిగా 2001లోనే గుర్తించారు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేపీ నడ్డా

HMPV కోవిడ్-19 వైరస్ లాంటిదేనా?
♦  హెచ్ఎంపీవీ కొన్ని విషయాల్లో సార్స్-కొవీ-2 (కొవిడ్-19 వైరస్)తో పోలి ఉంటుంది. అవి రెండూ అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారితీసేవే. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధశక్తి తగ్గిన వారికి ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది.
రెండింటి లక్షణాలూ దాదాపు ఒకేలా ఉంటున్నాయి. కొవిడ్ లో మాదిరిగానే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివీ ఇందులోనూ కనిపిస్తున్నాయి.

♦  ఇవి రెండూ దగ్గు, తమ్ములు, సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వైరస్ అంటుకున్న వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను అంటుకున్నా సోకుతాయి.

♦  అయితే, హెచ్ఎంపీవీని కొవిడ్ -19తో పోల్చడం కదరదు. హెచ్ఎంపీవీ చాలాకాలం క్రితం గుర్తించబడింది. ఐదేళ్లలోపు పిల్లల నుంచి 65ఏళ్లు పైబడిన పెద్దలను ప్రభావితం చేస్తుంది. ఏదైనా వైరస్ పరివర్తన చెంది తీవ్ర వైరస్ గా మారవచ్చు. అయితే, ప్రస్తుతం డేటా ప్రకారం.. హెచ్ఎంపీవీకి కొవిడ్-19కు సరిపోల్చలేము.

 

HMPVపై చైనా ఏం చెప్పింది?
♦  చైనా ప్రత్యేకంగా హెచ్ఎంపీవీ గురించి ప్రస్తావించలేదు. కానీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై నిఘా పెట్టారు. డిసెంబర్ నెలలో చైనా ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధికారకాలను గుర్తించడానికి, అవి వ్యాప్తి చెందుతున్న తీరుపై పర్యవేక్షణ మొదలు పెట్టారు. హెచ్ఎంపీవీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఐదేళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయస్సువారిని ఏమీ చేయదు. అయితే, చైనాలో 14ఏళ్ల లోపు వారినీ ఎక్కువ ప్రభావితం చేస్తోంది. నిజానాకి దీని విషయంలోనే కాదు.. ప్లూ, జలుబు వంటి ఎలాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అలవాట్లు, ప్రవర్తన మార్చుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి.

 

హెచ్ఎంపీవీపై భారత్ ఏం చెప్పింది..?
♦  భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు, తమిళనాడు రాష్ట్రంలో రెండు, మహారాష్ట్ర నాగపూర్ లో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒకటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక హెచ్ఎంపీవీ కేసును గుర్తించింది. హెచ్ఎంపీవీ లక్షణాలు కనిపిస్తే పిల్లలను పాఠశాలలకు పంపించవద్దని తల్లిదండ్రులను కర్ణాటక ప్రభుత్వం సూచించింది. బెంగళూరులోని అన్ని పాఠశాలల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా నిఘా పెట్టింది.

♦  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా హెచ్ఎంపీవీపై మాట్లాడుతూ.. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ వైరస్ ని 2001లో గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయస్సుల వారినీ ప్రభావితం చేస్తుంది. శాతాకాలం, వసంత రుతువు ప్రారంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎన్సీడీసీలు చైనాతోపాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్ లు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదని నడ్డా పేర్కొన్నారు.