హెచ్‌ఎంపీ వైరస్‌ను మొదటిసారిగా 2001లోనే గుర్తించారు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేపీ నడ్డా
శ్వాసకోశ వైరస్‌ల నివేదికలను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుందని చెప్పారు.

హెచ్‌ఎంపీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇది కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు. దీన్ని మొదటిసారిగా 2001లో గుర్తించారని తెలిపారు. ఇది చాలా సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోందని చెప్పారు.
ఈ వైరస్ గాలి, శ్వాస ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఇది శీతాకాలం, వసంత రుతువు ప్రారంభంలో అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఈ కేసులున్న చైనాతో పాటు పొరుగు దేశాలలో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు.
శ్వాసకోశ వైరస్‌ల నివేదికలను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుందని చెప్పారు. భారతదేశంలో సాధారణ శ్వాసకోశ వైరల్ పాథోజెన్‌లలో ఏ విధమైన పెరుగుదల కనిపించలేదని తెలిపారు.
పరిస్థితిని సమీక్షించేందుకు జనవరి 4వ తేదీన డైరెక్టర్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన పర్యవేక్షణ బృందం సమావేశం జరిగిందని చెప్పారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య సవాళ్లకు తక్షణమే స్పందించడానికి దేశం సిద్ధంగా ఉందని అన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
HMPV : HMP వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదు- అపోలో ఆసుపత్రి డాక్టర్ షర్మిల