New Stronger Variant Is Likely Causing Covid Surge, Warns Expert. What He Advises
Covid New Variant : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందిలేనని ఊపిరిపీల్చుకుంటున్న జనంలో మళ్లీ కరోనా భయం మొదలైంది. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గతకొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరింది. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్ కారణమనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో నిర్వహించక తప్పదని వైద్య నిపుణులు అంటున్నారు. లేదంటే వైరస్ వ్యాప్తికి గల కారణాలను తెలుసుకోవడం కష్టమేనని అంటున్నారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,518 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25వేలు దాటేసింది కూడా. ఇక పాజిటివిటీ రేటు 1శాతం దాటేసింది. ఒమిక్రాన్ వేరియంట్, దాని సబ్ వేరియంట్ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని TIGS డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా కేసులు పెరిగినా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందన్నారు. కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని మిశ్రా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కీలకమైన జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అధికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రిలో చేరే ప్రతిఒక్కరి శాంపిల్స్ సీక్వెన్సింగ్ నిర్వహించాలన్నారు. ఈ తరహా వైరస్‌లు ఎప్పుడూ మార్పులు చెందుతూనే ఉంటాయని తెలిపారు.
New Stronger Variant Is Likely Causing Covid Surge, Warns Expert. What He Advises
కరోనా కేసుల సంఖ్య పెరగడం సాధారణ విషయమేనని ఎయిమ్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5వేలను దాటేసింది. కరోనా నాల్గో వేవ్ ముప్పు ముంబైతో మొదలుకానుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా నాల్గో వేవ్ అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, అయినా ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Telangana Covid List Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు