భారతీయుల ప్రాణాలు తీస్తున్న ఓవర్ వర్క్.. దీన్ని నుంచి బయటపడటం ఎలా..

బర్నౌట్ సంకేతాలను ఎలా గుర్తించాలి, వాటి నుంచి బయటపడటం ఎలా.. ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్టులు చేసే సూచనలు ఏంటి..

Over Working (Photo Credit : Google)

Over Working : ఓవర్ వర్క్.. అధిక పని గంటలు.. భారతీయుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలు తెస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి దీని నుంచి బయటపడటం ఎలా? నిపుణులు ఏమంటున్నారు..

ప్రపంచంలో అత్యధికంగా పని చేసే వ్యక్తులలో భారతదేశంలోని నిపుణులు ఉన్నారు. కొన్ని రంగాలు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. పని గంటలు అధికంగా ఉండటం సమస్యలు (ప్రధానంగా బర్నౌట్) తెస్తోంది. ఈ పరిస్థితుల్లో బర్నౌట్ (బర్న్‌అవుట్ అనేది దీర్ఘకాలిక లేదా పదేపదే ఒత్తిడి వల్ల కలిగే భావోద్వేగ, మానసిక, శారీరక అలసట) సంకేతాలను ఎలా గుర్తించాలి, వాటి నుంచి బయటపడటం ఎలా.. ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్టులు చేసే సూచనలు ఏంటి..

మహమ్మారి సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. ఎంచక్కా ఆఫీసులకు వెళ్లే బాధ లేకుండా హ్యాపీగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం రావడంతో అంతా సంబరపడ్డారు. కానీ, ఇప్పుడదే శాపంగా మారిందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త సమస్యలకు దారితీసింది. పని వేళలు పెరిగిపోయాయి. రుగ్మతలకు దారి తీస్తోంది. అధిక పని, తీవ్రమైన ఒత్తిడి, జీవితంలో అసమతుల్యత భారతీయులను చంపుతున్నాయి.

ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ సంస్థలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరియాల్ మరణం తీవ్ర కలకలం రేపింది. అధిక పని చేయడం వల్లే అన్నా ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి కన్నీటిపర్యంతమైంది. ఆమె ఆ సంస్థలో చేరినప్పటి నుండి 4 నెలల పాటు 14 గంటల షిఫ్టులు, వారంలో ఏడు రోజులు పని చేసిందని వాపోయింది.

ఓవర్ వర్క్, బర్నౌట్‌ నుంచి బయటపడటం ఎలా..

బర్నౌట్ లక్షణాల గురించి అప్రమత్తంగా ఉండాలి..
అతిగా ఆలోచించడం, గుండె దడ, నొప్పులు, గ్యాస్ట్రిక్ లక్షణాలు, విశ్రాంతి లేకపోవడం, చిరాకు. ఇవన్నీ అధిక పని వల్ల కలిగే లక్షణాలు. టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి. డైలీ గోల్ పెట్టుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చేయండి.

క్రమశిక్షణ, సమర్థత..
క్రమశిక్షణతో కూడిన సమర్థవంతమైన పని వ్యవస్థను కలిగి ఉండటం. క్రమశిక్షణతో పాటు సమర్ధవంతంగా ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ చేయగలరని… ఇది బర్న్‌అవుట్ నుండి రక్షించడంలో సాయపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

స్నేహితులతో గడపండి..
స్నేహితులతో కాస్త సమయం గడపండి. మీకు ఇష్టవారితో కాసేపు మాట్లాడండి. మీ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీకు సంతృప్తిని కలిగిస్తుంది.

మీ హాబీస్ ఏంటో తెలుసుకోండి..
మీ అభిరుచికి తగ్గట్లుగా, మీకు సంతృప్తిని కలిగించే పనులను చేయండి.

ప్లాన్ ప్రకారం ముందుకెళ్లడం..
మీరు రోజువారీ, వారం, నెలవారి చేయాల్సిన పనులను విజువల్ కార్డుల్లో రూపొందించండి. దానిని మీ టేబుల్ పై ఉంచండి. ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించొచ్చు. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. ఒక వ్యవస్థను డెవలప్ చేసుకుంటారు.

బ్రేక్ తీసుకోండి..
తరుచుగా బ్రేక్ తీసుకోవాలి. సెలవు సమస్యకు పరిష్కారం కాదు. పోషకాహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలి.

ప్రొఫెషనల్ సాయం తీసుకోండి..
అవసరమైతే వృత్తిపరమైన సాయాన్ని పొందొచ్చు. సమస్యలతో ఒంటరిగా పోరాటం చేయాల్సిన పని లేదు.

మెరుగైన వర్క్ ప్లేస్ ఉండేలా చూసుకోవాలి..
బెటర్ వర్క్ ప్లేస్ చాలా ముఖ్యం. మంచి పని నిర్వహణ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సాయపడుతుంది. అధిక పని చేయమని ఒత్తిడి తెస్తే.. మేం యంత్రాలం కాదని విషయాన్ని చెప్పేయాలి.

కుటుంబంతో గడపండి..
వృత్తిపరమైన టార్గెట్ల కారణంగా కుటుంబాన్ని దూరం పెట్టొద్దు. కుటుంబసభ్యులతోనూ కాసేపు గడపటం ముఖ్యం. ఎందుకు పని చేస్తున్నారు, మీ లక్ష్యాలు, ప్రాధాన్యతలు వారు కూడా గ్రహించాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా కుటుంబాన్ని దూరం పెట్టొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : మీ పిల్లల పెంపకం సరిగానే ఉందా? మీరు సక్సెస్‌ఫుల్ పేరెంట్ అనుకుంటున్నారా? ఇదిగో చెక్‌లిస్ట్ మీకోసం..!