Maredu : అధ్యాత్మికంగానూ..ఔషధంగానూ…మారేడు మేలే!…

మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.

Maredu1

Maredu : మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. మారేడు ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మారేడు ఆకులలో ఖనిజాలు, విటమినులు, చాలా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యమైనవి. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మారేడు సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి వేసవి కాలంలో తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది. పేగులను శుభ్రపరచడమే కాకుండా, శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.

మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది. విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది. మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.

మారేడులో ఉన్న మరో స్పెషాలిటీ ఏటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని మారేడు వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద ఉంచితే త్వరగా గాయాలు మానతాయి.

మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉంది. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి కొంచం తేనె కలిపి తాగితే జ్వరము తగ్గిపోతుంది. త్రినేత్రుడైన పరమశివునికి మారేడు దళాలంటే ఎంతో ఇష్టమని భక్తులు నమ్ముతారు. శివపూజకు మారేడు దళాలు సమర్పిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. పురాణాల్లో దీని గురించి ప్రత్యేకంగా వివరించారు.