తిరువనంతపురంలో ఇకపై 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు!

  • Publish Date - February 21, 2020 / 12:07 AM IST

కేరళ రాజధాని తిరువనంతపురంలో 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితిలు ఉండవు. ఇకపై సురక్షితమైన వీధులతో దుకాణాలన్నీ కళకళలాడనున్నాయి. సురక్షితమైన వీధుల్లో వాణిజ్యపరమైన దుకాణాలు దర్శనమివ్వనున్నాయి.

అన్ని అనుకున్నట్టుగా ప్రణాళిక ప్రకారం జరిగితే అతి త్వరలో ఈ 24 గంటల షాపింగ్ సౌకర్యం కేరళవాసులకు అందుబాటులోకి రానుంది. షాపింగ్ రౌండ్ క్లాక్ చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సురక్షితమైన షాపింగ్ వీధులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో నగర పురపాలన పరిమితుల కింద 24 గంటల పాటు షాపులన్నీ తెరిచే ఉండనున్నాయి. 

ఈ ప్రాజెక్టును సురక్షితంగా సమర్థవంతమైన విధానంలో అమలు చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో టూరిజం అధికారులు, పోలీసులు, స్థానిక స్వీయ ప్రభుత్వం, కార్మిక శాఖలు, సిటీ కార్పొరేషన్లతో కూడిన పర్మినెంట్ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్టు ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది.

రాజధాని నగరంలో ఈ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించిన తర్వాత కేరళలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అమల్లోకి తీసుకొచ్చేలా అవసరమైన ఆదేశాలను సంబంధిత శాఖలకు జారీ చేయనున్నట్టు తెలిపింది.