Watery Eyes: కంట్లోంచి నీరు కారుతుందా.. పెద్ద కారణమే ఉండొచ్చు.. ముందే జాగ్రత్త పడండి

ఎప్పుడైనా ఇలా అవసరం ఉన్నప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం సహజం. కానీ కంట్లోఇంకేవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి సూచనగా కూడా కంట్లో నుంచి అధికంగా నీరు ఉత్పత్తి కావొచ్చు.

Watery Eyes Treatment

Watery Eyes Treatment : ఏడ్చినా, నవ్వినా కంట్లోంచి నీళ్లు రావడం సహజమే. కానీ కొందరికి అదే పనిగా కంట్లోంచి నీరు కారుతుంటుంది. మరికొందరికి కొంచెం నవ్విగా ఎంతో ఏడ్చినట్టుగా కళ్లలో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఇలా కళ్లలో నీరు అధిక మోతాదులో వస్తుంటే దాని వెనుక పెద్ద కారణమే ఉండొచ్చు.

కళ్ల కింద నీళ్ల ట్యాంకులు పెట్టుకున్నావా ఏంటి.. కొందరిని చూసి ఇలా కామెంట్ చేస్తుంటాం. నిజానికి ఇలా కళ్ల కింద నీళ్ల ట్యాంకులు లేకపోతే.. కంటి చూపే ఉండదు. ఆ నీళ్ల ట్యాంకులనే అశ్రు గ్రంథులు అంటారు. అంటే కన్నీటి గ్రంథులన్నమాట. ఈ టియర్ గ్లాండ్స్ నుంచి ఉత్పత్తయ్యే ద్రవమే.. మనం ఏడిచినప్పుడు మనకు కనిపించే కన్నీరు. అఫ్ కోర్స్ నవ్వినప్పుడు కూడా కళ్ల నుంచి ఈ కన్నీరు వస్తుందనుకోండి. అశ్రు గ్రంథుల నుంచి ఈ ద్రవం అశ్రు నాళాలు లేదా టియర్ టెక్ట్స్ ద్వారా కళ్ల నుంచి బయటికి వస్తుంది.

ఎందుకు అవసరం?
కళ్లు సక్రమంగా పనిచేయాలంటే.. అంటే కంటి చూపు సరిగా ఉండాలంటే మన కళ్లలో నిరంతరం ఈ ద్రవం తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఇది ఎక్కువ తక్కువలు కాకుండా సరిసమానంగా ఉన్నప్పుడే కంటి చూపు బాగుంటుంది. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. శరీరంలో నీరు తక్కువైతే డీహైడ్రేట్అయినట్టుగా, చర్మంలో తేమ తక్కువైతే పొడిబారిపోయి, చర్మంలో పగుళ్లు వచ్చినట్టుగాకంట్లో ఈ ద్రవం తక్కువైతే కళ్లు కూడా పొడిబారిపోతాయి. ఇది చాలా పెద్ద సమస్య కావొచ్చు.

బేసిగ్గా ఈ ద్రవం కళ్లకు ఒక లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు… కంట్లో చెత్త లేకుండా కళ్లను శుభ్రం చేయడానికి కూడా ఈ ద్రవం పనిచేస్తుంది. కంట్లోఏదైనా పడగానే, చిన్న దుమ్ము రేణువో, కనురెప్పల నుంచి రాలిన వెంట్రుక అయినా సరే… వెంటనే ముందు కళ్ల నుంచి నీళ్లు వచ్చేస్తాయి. కళ్లలో ఉండే ఈ ద్రవం కంటి నుంచి ఆ దుమ్ము రేణువునో లేక ఫారిన్ బాడీనో తీసివేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే వెంటనే ఈ ద్రవం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తయి, కళ్లలో నీళ్లు వస్తాయి. అంటే బయటి నుంచి కంట్లో ప్రవేశించిన పదార్థాన్ని ఇమీడియట్ గా బయటికి పంపించివేయడానికి కన్నీళ్లు ఉత్పత్తవుతాయి.

Also Read: వర్షాల్లో పొట్ట భద్రం.. పానీపూరీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

ఎప్పుడు సమస్య?
ఎప్పుడైనా ఇలా అవసరం ఉన్నప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం సహజం. కానీ కంట్లోఇంకేవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి సూచనగా కూడా కంట్లో నుంచి అధికంగా నీరు ఉత్పత్తి కావొచ్చు. అందుకే కన్నీళ్లు ఎక్కువగా వస్తున్నాయంటే దాని వెనుక ఇంకేదైనా సమస్య ఉన్నదేమో అని అనుమానించాలి.
• కొన్నిసార్లు కంట్లో ఇన్ ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా కంట్లో నుంచి నీరు కారొచ్చు. కొందరికి సైనస్ సమస్య ఉన్నప్పుడు కూడా కొంచెం నవ్వినా కళ్లలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి.
• డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవాళ్లలో కూడా కన్నీరు ఎక్కువ వస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్ అంటే కళ్లు పొడిబారడం. ఇలా పొడి కళ్ల సమస్య ఉన్నప్పుడు కంట్లో నీరు తక్కువ అవుతుంది. కానీ ఈ సమస్య వల్ల కూడా కంట్లో నీరు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావొచ్చు. పొడి కళ్లు ఉన్నప్పుడు కళ్లకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఈ అసౌకర్యాన్ని అధిగమించడానికి కళ్లు ఎక్కువ కన్నీళ్లను తయారుచేస్తాయి. పొడి కళ్లు ఉన్నవాళ్లలో చూపు కూడా దెబ్బతినవచ్చు. అందువల్ల ఇలా అదే పనిగా ఎక్కువగా కన్నీళ్లు వచ్చేవాళ్లలో డ్రై ఐస్ సమస్య లేదని నిర్ధారించుకోవడం చాలా అవసరం.
• ఏ కారణం చేతనైనా టియర్ డక్ట్స్ మూసుకుపోయినప్పుడు కూడా కంట్లో నీరు ఎక్కువగా రావచ్చు.

Also Read: ఆందోళన మిమ్మల్ని నియంత్రించేలా చేస్తుందా? సంకేతాల విషయానికి వస్తే..

చికిత్స ఎలా?
• కళ్లో ఈ ద్రవం ఎక్కువగా ఉత్పత్తి కావడం వెనుక కారణం ఏంటో నిర్ధారణ చేసుకుంటే దానికి తగిన చికిత్స ఇస్తే సమస్య తగ్గిపోతుంది.
• కళ్లు మంటగా ఉండటం వల్ల గానీ, పొడిబారడం వల్ల గానీ ఈ సమస్య వచ్చినట్టయితే.. ఆర్టిఫిషియల్ టియర్స్ సహాయపడుతాయి.
• కళ్లలో దురద, ఇరిటేషన్ తో పాటు కన్నీళ్లు ఎక్కువగా ఉంటే దాని వెనుక అలర్జీ కారణంగా ఉండొచ్చు. ఇలాంటప్పుడుయాంటిహిస్టమిన్లు వాడితే సమస్య తగ్గిపోతుంది.
• ఇకపోతే, టియర్ డక్ట్ లో ఆటంకం వల్ల గానీ, కనుపాపల్లో సమస్యల వల్ల గానీ నీరు కారుతూ ఉంటే మాత్రం డ్రైనేజీ పద్ధతి ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం పడొచ్చు. కనుపాప అమరికలో తేడాలుంటే సర్జరీ ద్వారా సరిచేస్తారు.
• ఇన్ ఫెక్షన్ వల్ల కన్నీరు వస్తుంటే యాంటీ బయాటిక్స్ తో తగ్గించొచ్చు.

పెద్ద వయసులో మరింత జాగ్రత్త
పెద్ద వయసు వాళ్లలో కళ్లలో నీళ్లు కారడానికి సాధారణ కారణం కన్నీటిలో నాణ్యత లోపించడం. కొన్నిసార్లు వేరే సమస్యలు కూడా ఉండొచ్చు. అందుకే వయసు పైబడిన వాళ్లలో ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. అసలు ఏ సమస్యా లేకపోయినా ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకుంటే కంటికి సంబంధించినవే కాకుండా, డయాబెటిస్ లాంటి ఇతర సమస్యలున్నా కూడా కంటి పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.


– డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి

ఫౌండర్ డైరెక్టర్, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్