Pallaburusu Review : ‘పళ్ళ బురుసు’ రివ్యూ.. కొడుకుపై కేసు పెట్టిన ముసలి తండ్రి కథ..

Pallaburusu Movie Review : బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆసక్తి నెలకొల్పింది.

  • Published on- August 14, 2026 / 11:28 PM IST

Pallaburusu Review

Pallaburusu Review : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మాణంలో ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పళ్ళ బురుసు సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

ముసలాయన శంభు(సుధాకర్ రెడ్డి)ఒంటరిగా ఓ గ్రామంలో నివసిస్తుంటారు. దగ్గర్లోనే వేరే గ్రామంలో అతని కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్) తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. శంభుకు పన్ను సమస్య రావడంతో హాస్పిటల్ కి వెళ్తే వేపపుల్ల వాడకుండా బ్రష్(పళ్ళ బురుసు)తో పళ్ళు తోమమని చెప్తారు. దాంతో పళ్ళ బురుసు, మెడిసిన్స్ తీసుకురమ్మని తన కొడుక్కి చెప్తాడు శంభు. కానీ తిరుపతి తీసుకురాడు. అంతే కాక తిరుపతి తన కూతురు పెళ్లి ఫిక్స్ అయినా, నిశ్చితార్థం అయినా, పెళ్ళికి కూడా తన తండ్రికి చెప్పడు, పిలవడు. అయినా మనవరాలి పెళ్లి అని శంభు పెళ్ళికి వెళ్తే ఎవరూ పట్టించుకోరు. ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాడు.

దీంతో తన కొడుకు తనకు పళ్ళ బురుసు కొనివ్వలేదని, మనవరాలి పెళ్ళికి పిలవలేదని, అసలు తనను పట్టించుకోవట్లేదని కోర్టులో కేసు వేస్తాడు శంభు. అదే సమయంలో కూతురు పెళ్లి చేసి అప్పుల పాలవుతాడు తిరుపతి. మరి ఈ కేసుకి తిరుపతి ఎలా స్పందిస్తాడు? తన తండ్రిని తిరుపతి అర్ధం చేసుకుంటాడా? ఒంటరితనంతో శంభు ఏం చేస్తాడు? ఈ మధ్యలో రవి- శ్వేత ప్రేమాయణం సంగతి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also See : Anna Konidela : మొదటిసారి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ భార్య.. ట్రైన్‌లో వెళ్లి పూజలు చేసి.. అన్నా కొణిదెల ఫొటోలు వైరల్..

సినిమా విశ్లేషణ..

బ్రష్ కొనివ్వలేదు అని కొడుకుపై కేసు వేసాడంటూ ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఆసక్తి నెలకొల్పింది. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్, పేరెంట్స్ ఎమోషన్ కథ అని ముందే అర్ధమయింది. ఫస్ట్ హాఫ్ అంతా శంభు పళ్ళ బురుసు కోసం చేసే ప్రయత్నాలు, తిరుపతి కూతురు పెళ్లి, ఊళ్ళో శంభుతో ఉండే ఇంకో నలుగురు ముసలి తాతలతో సరదాగా కామెడీగా సాగుతుంది. కొడుకుపై శంభు కేసు వేసిన తర్వాత నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. తండ్రి కొడుకు ఎవరికి వాళ్ళు తగ్గము అంటూ సింపుల్ ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ మొదట కాస్త కామెడీగా సాగినా తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో ఓ కొత్త పాయింట్ ని తీసుకొని దర్శకుడు మరింత ఎమోషనల్ చేసాడు.

సినిమా అంతా అమాయకత్వంగా శంభు మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుత సమాజంలో పేరెంట్స్ ని పిల్లలు పట్టించుకోవట్లేదు అనే పాయింట్ ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేసారు. ఆ ఎమోషన్ బాగానే పండింది కానీ ఆ ఎమోషన్ కోసం బాగా సాగదీశారు సెకండ్ హాఫ్ లో. కొన్ని సీన్స్ లో ఏడ్చేస్తాము. ఈ మధ్యలో శంభు ఫ్రెండ్స్ చేసే హడావిడి, రవి – శ్వేత లవ్ స్టోరీ మరీ సిల్లీగా అనిపిస్తాయి. కనీసం బేసిక్ వాడుక ఇంగ్లీష్ పదాలు కూడా తెలియని వాళ్ళు ఇప్పటి సమాజంలో ఉన్నట్టు చూపించి దాంతో కామెడీ చేద్దామని ప్రయత్నించారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ముసలి వాళ్ళతో చేతిలో ఫోన్స్ పెట్టి మనుషులను పట్టించుకోరు అనే మెసేజ్ బాగానే ఇచ్చారు.

ఒంటరితనం ఎంత భయంకరమైనది, ముసలితనంలో అది ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనే మెసేజ్ ని బాగా చూపించారు. అయితే క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు కానీ ఎమోషనల్ గా ముగిస్తే ప్రేక్షకుడు రియాలిటీకి కనెక్ట్ అయి బరువైన హృదయంతో బయటకు వెళ్ళేవాడు. 20 రూపాయల బ్రష్ కొనుకోలేక కేసు వేయడం ఎందుకు అనే డౌట్ వచ్చినా కొడుకు నుంచి కావాల్సింది డబ్బులు కాదు ప్రేమ, పలకరింపు అనే ఎమోషన్ ని బాగానే పండించారు. మొదట నవ్వుకున్నా చివర్లో ఎమోషనల్ అవుతాం. పేరెంట్స్ ని సరిగా చూసుకోవాలి అని కొన్ని వందల సినిమాలు వచ్చినా ఈ పళ్ళ బురుసు కాన్సెప్ట్ తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేసారు. ఫ్యామిలీతో కలిసి హాయిగా ఈ సినిమాని చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

శంభు పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అదరగొట్టేసాడు. ఒంటరిగా బతికే ముసలి పాత్రలో జీవించేసారు. ఆ పాత్రలో ఒదిగిపోయి ఎమోషన్ ని పండించారు. కొడుకు పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా చాలా బాగా నటించారు. ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి జంట క్యూట్ గా కనిపిస్తూనే బాగా నటించారు. మిగిలిన నటీనటులు, ముసలిపాత్రల్లో నటించిన సీనియర్ నటులు అంతా చాలా బాగా నటించారు.

Also Read : Makutam Review: ‘మకుటం’ మూవీ రివ్యూ.. విశాల్ రెండు పాత్రల్లో మెప్పించాడా?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. పక్కా తెలంగాణ గ్రామంలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడంతో సన్నివేశాలు సహజంగా వచ్చాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీసిన సీన్స్ మాత్రం ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. పాత కథే అయినా కొత్త పాయింట్ తో కొత్త కథనంతో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా చిన్న బడ్జెట్ లోనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘పళ్ళ బురుసు’ సినిమా కొడుకు పట్టించుకోవట్లేదని ఓ ముసలి తండ్రి పడే ఆవేదనను నవ్వించి ఏడిపిస్తూ చూపించిన కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.