తనకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్ పాయల్ ఘోష్..
సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. పావలా జరిగితే పది రూపాయలు చేసి చెప్తున్నారు, చూపిస్తున్నారు. ‘పువ్వు పూసింది అంటే కాయ కాసిందని కొందరు.. ఆ కాయ మేం తిన్నాం టేస్ట్ అదిరిపోయిందని మరికొందరు.. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు తమ స్టైల్లో సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు.
తాజాగా హీరోయిన్ పాయల్ ఘోష్‌కి కరోనా అంటగట్టడంతో లబోదిబోమంటుంది. ఇంతకీ ఈ పాయల్ ఎవరంటే మంచు మనోజ్‌తో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. తర్వాత ఫేడవుటయింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. దీంతో పాయల్‌కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించింది పాయల్.
‘‘గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట నిజమే. ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. ఇది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించగా.. మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే ముగుస్తుందని బలంగా నమ్ముతున్నా. అతి త్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నమ్ముతున్నాను’’.. అంటూ వివరణ ఇచ్చింది పాయల్ ఘోష్.