సెట్‌లో కుప్పకూలి.. ఎవరూ వాహనం ఆపకపోవడంతో నటుడు మృతి..

  • Publish Date - September 14, 2020 / 07:08 PM IST

Actor Prabeesh Chakkalakkal Passes away: మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలక్కల్ (44) కేరళలోని కొచ్చిలో జరుగుతున్న షూటింగులో సడెన్‌గా కుప్పకూలిపోయి మృతి చెందారు.


వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం నిమిత్తం ఓ టెలీ షూట్ చేస్తుండగా.. సడెన్‌గా ప్రబీష్‌ కుప్పకూలిపోవడంతో.. తన తోటి సిబ్బంది వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.


అయితే రోడ్డుపై వెళ్లే ఒక్కరు కూడా వాహనం ఆపకపోవడంతో ప్రబీష్‌ అక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చివరికి తన టీమ్‌లోని వ్యక్తి ప్రబీష్ జేబులో ఉన్న కారు కీని గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రబీష్‌ ప్రాణాలను కాపాడలేకపోయారు.


ప్రబీష్ పలు టెలీ ఫిల్మ్స్‌లో నటించడంతో పాటు పలు చిత్రాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని చేశారు. తండ్రి జోసఫ్‌, భార్య జాన్సీ, కూతురు తనియలతో కలిసి నివసిస్తున్నారు ప్రబీష్‌. ఆయన మృతికి పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలియచేస్తున్నారు.