Prakash Raj Video: వాళ్లకు లీగల్‌ నోటీసులు పంపాను: బెట్టింగ్‌ యాప్ కేసుపై ప్రకాశ్‌ రాజ్‌

అది మళ్లీ ఇప్పుడు లీకైందని, అందుకే తాను ఈ సమాధానం చెబుతున్నానని తెలిపారు.

Prakash Raj

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత వంటి చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై ప్రకాశ్ రాజ్ ఓ వీడియో రూపంలో స్పందించారు.

తాను ఇప్పుడు ఓ గ్రామానికి షూటింగ్‌ నిమిత్తం వచ్చానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. బెట్టింగ్‌ యాప్‌లు, తాను చేసిన ఒకప్పటి యాడ్‌ గురించి తనకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. తాను సాధారనంగా అందరినీ ప్రశ్నిస్తుంటానని, అటువంటి తాను తనపై ఆరోపణలు వస్తే జవాబు చెప్పాల్సిందేనని తెలిపారు. 2016లో తాను ఆ ప్రకటనలో చేసింది నిజమేనని అన్నారు.

Also Read: విడాకులు తీసుకునే వేళ క్రికెటర్ చాహల్‌, ధనశ్రీ వర్మ కోర్టుకు ఎలా వచ్చారో చూడండి..

అయితే, అది సరికాదని ఆ తర్వాత తెలుసుకున్నానని తెలిపారు. తదుపరి సంవత్సరం ఈ యాడ్‌కు సంబంధించిన తన ఒప్పందాన్ని పొడిగిస్తానని వారు అడిగారని చెప్పారు. అయితే, ఆ ప్రకటన తెలియక చేశానని, ఒప్పందం ముగిసింది కాబట్టి, ఇక దాన్ని ప్రసారం చేయొద్దని, తాను మళ్లీ ఇటువంటి వాటికి నటించబోనని చెప్పానని తెలిపారు.

అనంతరం అటువంటి యాప్‌ల ప్రచారానికి ఒప్పందాలు చేసుకోలేదని చెప్పారు. 2021లో ఆ సంస్థ మరో సంస్థను కొన్నదని సామాజిక మాధ్యమాల్లో తన పాత ప్రకటనను వాడారని, దీంతో తాను వారికి లీగల్‌ నోటీసులు పంపానని తెలిపారు.

వాళ్లు దాన్ని ఆపేశారని చెప్పారు. అది మళ్లీ ఇప్పుడు లీకైందని, అందుకే తాను ఈ సమాధానం చెబుతున్నానని తెలిపారు. తనకు పోలీసుల నుంచి ఇంతవరకు ఎటువంటి మెసేజ్ రాలేదని, ఒకవేళ వస్తే వారికి వివరణ ఇస్తానని అన్నారు. గేమింగ్‌ యాప్స్ కు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు.