ఎట్టకేలకు ‘దసరా’ సినిమా విలన్ అరెస్ట్.. మొన్ననే హోటల్‌ మూడో అంతస్తు నుంచి దూకి పారిపోయి..

ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌లో నుంచి చాకో పారిపోతుండగా రికార్డయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమాలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకోను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫొకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అతడిని కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షైన్‌ టామ్‌ చాకో డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని ఇవాళ పోలీసులు దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత చాకోను అరెస్టు చేశారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాక, ఈ కేసులో తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారు.

Also Read: ఉప్పల్ స్టేడియంలో ఈ పెవిలియన్ నుంచి అజారుద్దీన్ పేరు తొలగింపు.. ఎందుకంటే?

ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌లో మూడో అంతస్తు నుంచి దూకి చాకో పారిపోతుండగా రికార్డయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ హోటల్‌లో డ్రగ్స్‌ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఇటీవల సోదాలు జరపగా అతడు అదే సమయంలో పారిపోయాడు.

అనంతరం అతడికి పోలీసులు సమన్లు జారీ చేసి, విచారణకు రావాలన్నారు. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు ఎర్నాకుళం ఉత్తర పోలీస్‌ స్టేషన్‌కు అతడు వచ్చాడు.

షైన్‌ టామ్‌ చాకో గతంలోనూ డ్రగ్స్‌ కేసును ఎదుర్కొన్నాడు. 2015లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, 2025లో అతడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ కేసులో పోలీసులు చట్టబద్ధమైన ప్రక్రియను సరిగ్గా పాటించలేదని చెప్పింది. ఇప్పుడు చాకో మళ్లీ డ్రగ్స్‌ కేసులోనే అరెస్టు కావడం గమనార్హం.