Sumanth
Sumanth: నటసామ్రాట్ ఏఎన్నార్ మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుమంత్ త్వరలో కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. తమ కుటుంబానికి సుపరిచితురాలైన పవిత్రతో సుమంత్ ఏడడుగులు వెయ్యబోతున్నారు. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితుల మధ్య, హైదరాబాద్‌లో సుమంత్ కుమార్ – పవిత్రల పెళ్లి జరుగనుంది. వీరి వెడ్డింగ్‌కి సంబధించిన శుభలేఖ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సుమంత్‌కి విషెస్ చెబుతున్నారు.
వెడ్డింగ్ కార్డ్‌లో కాబోయే జంట పేర్లు తప్ప మిగతా వివరాలేం కనిపించకుండా గోప్యంగా ఉంచారు. ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె మరో వివాహం చేసుకున్నా సుమంత్ మాత్రం సింగిల్‌గానే ఉన్నారు. పవిత్ర, సుమంత్ బాల్యస్నేహితురాలు.. ఇద్దరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. పవిత్ర ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారని సమాచారం.
అక్కినేని ఫ్యామిలీ నుండి మూడో తరం వారసుడిగా ‘ప్రేమకథ’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘సత్యం’, ‘గౌరి’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలతో ఆకట్టుకున్న సుమంత్ కొంత గ్యాప్ తర్వాత ‘మళ్లీరావా’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ట్రాక్‌లోకి వచ్చారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో తాత క్యారెక్టర్ చేసి అలరించారు. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజగత్’, ‘కపటధారి’ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. సుమంత్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్న ‘అనగనగా ఒక రౌడీ’ త్వరలో రిలీజ్ కానుంది.