గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – మొక్కలు నాటిన రష్మిక, సంపత్ నంది..

  • Publish Date - July 16, 2020 / 11:40 AM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్‌‌లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.
ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ ఛాలెంజ్‌లోకి తనను ఆహ్వానించిన సమంతకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానులు, అదేవిధంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇదేవిధంగా కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లకు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ: ‘పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి బాధ్యతగా అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. పద్మశ్రీ వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటారు అని తెలిసినప్పుడు సంతోషించాను. అదేవిధంగా మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటారు. కానీ మన సంతోష్ అన్న ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది, మన సంతోష్ అన్నకు వారికి మించిన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల మన మూతులకు మాస్కులు కట్టుకొని తిరుగుతున్నామని భవిష్యత్తులో మన వీపులకు ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.