మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి. తెలుగులో స్వాతికిరణం సినిమా చేశాడు. తరువాతి కాలంలో నేరుగా తెలుగు సినిమాలో నటించలేదు. అయితే ఇటీవల రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌లో నటించి హిట్ దక్కించుకున్నాడు ఈ మలయాళం స్టార్. ఈ క్రమంలోనే మమ్ముట్టి హీరోగా నటించిన ‘మమాంగం’ అనే సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. యాత్ర సినిమాతో తెచ్చుకున్న క్రేజ్, భారీ నిర్మాణ విలువలతో సినిమాను తీయగా తెలుగులో వర్క్ ఔట్ అవుతుందని భావించి అల్లూ అరవింద్ ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ప్రోగ్రామ్లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు అల్లూ అరవింద్. పవన్ కళ్యాణ్ సినిమాలో మమ్ముట్టిని ‘విలన్‌గా నటిస్తారా?’ అని అడిగారట అల్లూ అరవింద్. అయితే దానికి ‘నో’ అని చెప్పేశాడట మమ్ముట్టి. ఇదంతా ఇప్పటి మాట కాదు. చాలా కాలం క్రితం జరిగిన విషయమే. కానీ ఆ విషయాన్ని అల్లు అరవింద్ కొత్తగా గుర్తు చేసుకున్నారు.
స్వాతికిరణం కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతాడా? అని అన్నారట. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించాను. ఆయనకి ఫోన్ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా. దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. నేను ‘అడగలేను’ అన్నా. దాంతో ఆయన నవ్వుతూ ఫోన్ పెట్టేశారు’ అంటూ చెప్పారు అరవింద్.
అల్లు అరవింద్‌తో పవన్ చేసిన సినిమా ‘జానీ’, ‘జల్సా’. జానీ సినిమాలో మమ్ముట్టీకి సరిపోయే ప్రతి నాయిక పాత్ర లేదు. కచ్చితంగా జల్సాలో ముఖేష్ రిషి పాత్ర కోసం మమ్ముట్టిని అడిగారని అంటున్నారు అభిమానులు. ఇక బాహుబలి ఇచ్చిన స్పూర్తితో అన్ని ఇండస్ట్రీలో చారిత్రక నేపథ్యమున్న యోధుడి కథతో మామంగం సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో చేస్తున్నారు.