‘ముఖ్య గమనిక’ రివ్యూ.. అల్లు అర్జున్ బామ్మర్ది హీరోగా మెప్పించాడా?

అల్లు అర్జున్(Allu Arjun) మేనమామ కొడుకు, బామ్మర్ది అయిన విరాన్ ముత్తంశెట్టి(Viran Muttamsetty) హీరోగా ఎంట్రీ ఇస్తూ వచ్చిన సినిమా ముఖ్య గమనిక.

Allu Arjun Cousin Viran Muttamsetty Mukhya Gmanika Movie Review and Rating

Mukhya Gamanika Review : అల్లు అర్జున్(Allu Arjun) మేనమామ కొడుకు, బామ్మర్ది అయిన విరాన్ ముత్తంశెట్టి(Viran Muttamsetty) హీరోగా ఎంట్రీ ఇస్తూ వచ్చిన సినిమా ముఖ్య గమనిక. విరాన్ ముత్తంశెట్టి హీరోగా, లావణ్య సాహుకార హీరోయిన్ గా, ఆర్యన్ ఇప్పిలి, చిత్రం భాష, జ్యోతి స్వరూప్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ముఖ్య గమనిక సినిమా ఫిబ్రవరి 23న థియేటర్స్ లోకి వచ్చింది. క్రైం ఇన్వెస్టిగేటివ్ కథాంశంతో వేణు మురళీధర్ దర్శకత్వంలో రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలుగా శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్ లతో ఆసక్తి కలిగించడంతో పాటు, అల్లము అర్జున్ బామ్మర్ది హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే..
విరాన్( విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీసాఫీసర్ కొడుకు. తండ్రి అనుకోకుండా హత్యకు గురవడంతో ఆ జాబ్ విరాన్ కి వస్తుంది. విరాన్ తండ్రి లాగే పలువురు పోలీసాఫీసర్లు వరుసగా హత్యకు గురవుతుంటారు. దీంతో దీని వెనక ఉన్న మిస్టరీని చేధించాలని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు విరాన్. ఈ క్రమంలో అతని తండ్రి చనిపోయిన రోజు ఓ RJ మిస్సింగ్ కేసు వచ్చినట్టు గుర్తించి ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నాడు. RJ ఎలా మిస్ అయ్యాడు? RJ మిస్సింగ్ కేసుకి, విరాన్ తండ్రి హత్యకు సంబంధం ఏంటి? విరాన్ ఈ కేసుని ఎలా ఛేదించాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
సాధారణంగా క్రైం ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అంతే థ్రిల్లింగ్ గా తీసుకెళ్లినా అక్కడక్కడా మాత్రం కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఆ హత్యలు చేయడం, వాటి మిస్టరీ ఛేదించడం, దాని కోసం విరాన్ పడే తపన చక్కగా చూపించారు.

నటీనటుల విషయానికొస్తే..
హీరో విరాన్ అల్లు అర్జున్ బామ్మర్ది అయినా కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలా క్రైం థ్రిల్లర్ కథని ఎంచుకొని నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. లావణ్య సాహుకార, RJ రోల్ చేసిన నటుడు, ఆర్యన్ ఇప్పిల్లి తమ నటనతో మెప్పించారు.

సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథ పాతదే అయినా కథనం మాత్రం ఇన్వెస్టిగేషన్ సబ్జెక్టు కావడంతో చాలా థ్రిల్లింగ్ గా రాసుకున్నారు. వేణు ముర‌ళీధ‌ర్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో చిన్న సినిమా అయినా నిర్మాతలు బాగా ఖర్చుపెట్టి క్వాలిటీగా నిర్మించారు.

మొత్తంగా ముఖ్య గమనిక వరుస హత్యలని చేధించే ఓ క్రైం థ్రిల్లింగ్ సినిమా. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు కచ్చితంగా ఈ సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు