మా నాన్నకు పద్మశ్రీ : అల్లూ అర్జున్ రిక్వెస్ట్

  • Publish Date - January 7, 2020 / 02:48 AM IST

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ నాన్న(అల్లూ అరవింద్) గురించి నేను, నా గురించి నాన్న ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్‌ చేసింది నాన్నే. కానీ ఈరోజు ఆయనకు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను.

ఈ థ్యాంక్స్‌ కేవలం నాతో సినిమా చేసినందుకు కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పటికీ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్‌ నాకు ఉంటుందని అన్నారు.

అలాగే “మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ‘ఆర్య’ సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. పెళ్లైన తర్వాత నా భార్యను ఒకటే అడిగాను. నాకు ఎన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాను అని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చూసిన వారిలో ది బెస్ట్‌ పర్సన్‌ మా నాన్నే.

45 ఏళ్లుగా సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు నాన్న. మనిషిలో ప్యూరిటీ లేకపోతే ఇంతకాలం సౌత్‌ ఇండియాలో, ఇండియాలో నంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌గా ఉండలేరు. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక నాకు ఉంది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుంచి ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఇండస్ర్టీకి ఎంతో సేవ చేసిన ఆయన అటువంటి గొప్ప అవార్డుకు అర్హుడు’’ అని అన్నారు అల్లూ అర్జున్.