Amma Rajashekar Amma Raagin Raj Thala Movie Review
Thala Movie Review : దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తల’. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తూ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. తల సినిమా నేడు ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే.. కొడుకు(అమ్మ రాజన్ రాజ్) చిన్నప్పుడే తండ్రి(రోహిత్) తన తల్లిని వదిలేసి వెళ్ళిపోతాడు. పెద్దయ్యాక తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అక్కడ తండ్రి వేరే మహిళ(ఎస్తేర్ నోరాన్హా)ని పెళ్లి చేసుకొని కుటుంబంతో ఉంటాడు. దీంతో ఆ కుటుంబంలో పనోడిగా జాయిన్ అవుతాడు. అయితే ఆ కుటుంబానికి ఓ సమస్య రావడంతో హీరో ఇంటర్వెల్ కి ఒకర్ని చంపేస్తాడు. అసలు ఆ కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటి? కొడుకు తల్లి కోసం తండ్రిని తీసుకెళ్తాడా? ఆ కుటుంబానికి తాను ఎవరో ఎలా తెలుస్తుంది? తన తండ్రి తల్లిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? తన లవ్ స్టోరీ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Aha Dance Ikon 2 : నేటి నుంచే ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ షో.. ఇలాంటి షో ఇప్పటిదాకా చూడలేదు..
సినిమా విశ్లేషణ.. ట్రైలర్ లో చూపించినట్టు అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ప్రాణమిచ్చే కొడుకు అనే కథగా రాసుకున్నారు తల సినిమాని. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరో తల్లి, హీరో తండ్రి కుటుంబం పాత్రల పరిచయంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఇచ్చే బ్యాంగ్ అదిరిపోతుంది. దాంతో సెకండ్ హాఫ్ లో యాక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఆసక్తి నెలకొంటుంది.
అమ్మ రాజశేఖర్ సినిమాలు అంటే ఓ స్టైల్ ఉంటుంది. యాక్షన్, డైలాగ్స్, ఓ లవ్ స్టోరీతో ఒక మాసీ స్టైల్ లో ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత అమ్మ రాజశేఖర్ తన కొడుకు రాగిన్ రాజ్ ని హీరోగా పెట్టి మళ్ళీ అలాంటి మాస్ సినిమాతో వచ్చాడు. చాలా సీన్స్ లో అమ్మ రాజశేఖర్ స్టైల్ కనిపిస్తుంది. ముఖ్యంగా డ్యాన్స్ చూస్తే ఇది అమ్మ రాజశేఖర్ మాస్టర్ చేసిందని ఈజీగా అర్థమయిపోతుంది. అమ్మ ఎమోషన్ బాగానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ ఉన్నా సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ తో సాగుతుంది. సినిమాలో వైలెన్స్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూనే తాను కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని అమ్మ రాజశేఖర్ బాగానే కష్టపడ్డారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా మొదటి సినిమా అయినా బాగానే కష్టపడి నటించాడు. యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లలో చాలా బాగా మెప్పించాడు. ఒక కొత్త కుర్రాడు అది కూడా ఓ 18 ఏళ్ళ కుర్రాడు ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకాస్త కష్టపడితే మంచి నటుడు అవుతాడు రాగిన్ రాజ్. హీరోయిన్ అంకిత పర్వాలేదనిపించింది. తండ్రి పాత్రలో రోహిత్, ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనిపించే ఎస్తేర్ నోరోన్హా కామెడీ, ఎమోషన్ తో, విజ్జి చంద్రశేఖర్ నెగిటివ్ పాత్రలో, అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. స్టార్ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేశారు. ఎలివేషన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చినా కొన్ని సీన్స్ లో మాత్రం డల్ అయిపోయింది. చక్కని లిరిక్స్ తో సాంగ్స్ బాగానే రాశారు. అమ్మ సెంటిమెంట్ తో ఓ మంచి కథ రాసుకొని ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్క్రీన్ ప్లేతో అమ్మ రాజశేఖర్ తల సినిమాని బాగానే తెరకెక్కించారు. సినిమాలో ఉత్తరప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా తల సినిమా తల్లి కోసం తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన కొడుకు, అతను చేసే యాక్షన్ తో ఓ మదర్ సెంటిమెంట్ యాక్షన్ సినిమాగా మెప్పిస్తుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.