అవసరమా?: రేణు మండల్ మేకప్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలట

  • Publish Date - November 19, 2019 / 04:18 AM IST

దేవుడు సల్లంగ చూడాలే కానీ బికారి లక్షాధికారిగా ఒక్క రోజులో మారిపోతారు. రాత్రికి రాత్రే రాజులైపోతారు. అటువంటి అదృష్టమే రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ జీవనం సాగించే రేణు మండల్ జీవితాన్ని మార్చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలోని రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో బిక్షం ఎత్తుకుని ఒకప్పుడు జీవించిన రేణు మండల్ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

అయితే ఎక్కడలేని క్రేజ్ ఆమెకు రావడానికి కారణం సోషల్ మీడియా. అయితే వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవడం మాత్రం ఆమెకు చేతకాట్లేదు. హిమేష్ రెష్మియా రూపొందించిన ‘తేరి మేరీ కహానీ’ ఆల్బమ్‌లో ఓ పాట పాడే అవకాశం దక్కించుకున్న ఆమె గాత్రానికి ఎందరో అభిమానులు అయ్యారు. అంతేకాదు ఆమెకు ఎందరో అండగా నిలిచారు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు విపరీతంగా చేస్తున్నారు.

అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఓ అభిమాని రణు మండల్‌ని కలిసి ఆమెతో సెల్ఫీ తీసుకుంటానని అడిగితే, తనకు కాస్త దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోమని ఆమె చెప్పడం వీడియోలో రికార్డ్ అయ్యింది. అది వైరల్ అవ్వగా నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. ఎక్కడ నుంచి వచ్చారో మర్చిపోయారా అంటూ నెటిజన్లు నిలదీశారు. స్టార్ డమ్‌ను తలకెక్కించుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది.

ఇప్పుడు మరోసారి ఆమె నెటిజన్ల కోపానికి కారణం అయ్యింది. ఆమె వేసుకున్న మేకప్ అందుకు కారణం. ఆమె ఫుల్ మేకప్‌తో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఆమె మేకప్ ఓవర్ డోస్ అవ్వడంతో.. అసలు చూడడానికి చాలా వింతగా ఉంది. ఈ క్రమంలో ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసి ఆడుకుంటున్నారు నెటిజన్లు.

అంతేనా మిమ్మల్ని అందరూ గౌరవించింది. మెచ్చుకుంది మీ రూపం చూసి కాదు గాత్రం చూసి, నడమంత్రపు సిరి నెత్తికెక్కకూడదు. మీరు ఇంతకుముందులాగే ఉండండి అంటూ సూచిస్తున్నారు. ఇక ఆమెకు మేకప్ వేసిన వ్యక్తి ఎవరో కానీ, వారి ఆస్కార్ అవార్డ్ ఇవ్వవచ్చు అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.