Parakramam : ‘పరాక్రమం’ మూవీ రివ్యూ.. బండి సరోజ్ కుమార్ హిట్ కొట్టాడా?

సినిమాలో బండి సరోజ్ కుమార్ రాసిన డైలాగ్స్, హీరో ఎలివేషన్ షాట్స్, హీరో నటన ప్రేక్షకులని మెప్పిస్తాయి.

Bandi Saroj Kumar Parakramam Movie Review and Rating

Parakramam Movie Review : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తాజాగా ఆగస్టు 22న ‘పరాక్రమం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ ఈ సినిమాని నిర్మించాడు కూడా. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాల్లో లంపకలోవ అనే గ్రామంలో సత్తిబాబు(బండి సరోజ్ కుమార్) అనే మానసిక స్థిమితం లేని వ్యక్తి నాటకాలు వేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ఓ సంఘటన వల్ల భయంతో చనిపోతాడు. అతని కొడుకు లోవరాజు(బండి సరోజ్ కుమార్)కి కూడా నాటకాలు, క్రికెట్ అంటే పిచ్చి. ఆ ఊళ్ళోనే నెంబర్ 1 క్రికెటర్ లోవరాజు. రవీంద్రభారతి లో వాళ్ళ నాన్న రాసిన పరాక్రమం అనే నాటకం వేయాలని హైదరాబాద్ వస్తాడు. ఊళ్లో మునసబుకు లోవరాజు అంటే భయం. మతిస్థిమితం లేని మునసబు కూతురు బుజ్జమ్మ(శృతి సమన్వి) లోవరాజు పరిచయంతో అతనిపై ఇష్టం పెంచుకుంటుంది. అతను హైదరాబాద్ వచ్చి నాటకం వేస్తాడని ఎదురుచూస్తుంది. మునసబు కొడుకు నానాజీ(నిఖిల్ గోపు)కి లోవరాజుకి క్రికెట్ గొడవలు ఉంటాయి. ఆల్రెడీ లోవరాజు లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటాడు.

లోవరాజు హైదరాబాద్ లో నాటకం వేశాడా? అసలు మునసబుకు లోవరాజు అంటే ఎందుకు భయం? లోవరాజు ఫెయిల్యూర్ లవ్ కథేంటి? మునసబు కూతురు ఎందుకు లోవరాజు నాటకం కోసం ఎదురుచూస్తుంది? మునసబు కొడుకుతో లోవరాజు క్రికెట్ గొడవేంటి? సత్తిబాబు కథేంటి? సత్తిబాబు రాసిన పరాక్రమం కథేంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Ravi Teja : షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఆస్ప‌త్రిలో శ‌స్త్ర‌చికిత్స పూర్తి..

సినిమా విశ్లేషణ.. బోల్డ్ సినిమాలు తీస్తాడనే పేరున్న బండి సరోజ్ కుమార్ యూట్యూబ్ లో పలు సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అయితే తన కంటెంట్ లో బోల్డ్ పక్కన పెట్టి ఒక సినిమాతో థియేట్రికల్ రిలీజ్ కి వచ్చాడు. పరాక్రమం ఒక మాములు రివెంజ్ కథ. తండ్రి పగను కొడుకు తీర్చుకునే కథ. కానీ కథనం మాత్రం అన్ని పాత్రల వైపు నుంచి చూపిస్తూనే, గతానికి, ప్రస్తుతానికి మధ్య చూపించారు. దీంతో సినిమా కొంత ఆసక్తిగా సాగినా అక్కడక్కడా కన్ఫ్యూజ్ తప్పదు.

పరాక్రమం చూస్తుంటే బండి సరోజ్ కుమార్ తనని ఎలివేట్ చేసుకోవడానికి, తనలోని నటనను చూపించడానికి ఈ సినిమాని చేసినట్టు అనిపిస్తుంది. సినిమాలో బండి సరోజ్ కుమార్ రాసిన డైలాగ్స్, హీరో ఎలివేషన్ షాట్స్, హీరో నటన ప్రేక్షకులని మెప్పిస్తాయి. అయితే సినిమా చూస్తున్నంతసేపు మల్లి సరోజ్ కుమార్ పాత సినిమాల్లాగే యూట్యూబ్ సినిమానో లేదా ఇండిపెండెంట్ సినిమానో చూసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ 70 MM సినిమా చూసిన ఫీలింగ్ రాకపోవచ్చు. అయితే సరోజ్ కుమార్ కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తో మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే థియేటర్ పై కూడా బండి సరోజ్ కుమార్ సక్సెస్ అయినట్టే.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటికే బండి సరోజ్ కుమార్ తన నటనతో నిర్భందం, మాంగల్యం లాంటి సినిమాలతో మెప్పించగా ఇప్పుడు మరోసారి పరాక్రమం సినిమాలో క్రికెటర్ గా, నాటకాలు వేసే వ్యక్తిగా, మానసిక స్థిమితం లేని వ్యక్తిగా తన నటనతో అదరగొట్టాడు. మానసిక స్థిమితం లేని అమ్మాయిగా క్లాసికల్ డ్యాన్సర్ శ్రుతి సమన్వి చాలా బాగా మెప్పించింది. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర చేయడం విశేషం. నిఖిల్ గోపు, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, అనిల్.. మిగిలిన నటీనటులు కూడా వారి నటనతో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్.. అన్నీ బండి సరోజ్ కుమార్ చేయడం గమనార్హం. ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క ఇన్ని బాధ్యతలు బాగానే నెరవేర్చారు. ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. కథ రెగ్యులర్ రివెంజ్ స్టోరీ అయినా కథనం మాత్రం కొత్తగా ట్రై చేసారు. ఈ సినిమాకు నిర్మాత కూడా బండి సరోజ్ కుమారేబి కావడంతో చిన్న సినిమా అయినా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేసారు.

మొత్తంగా పరాక్రమం సినిమా ఒక మాములు రివెంజ్ కథకి సరికొత్త కథనంతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో అదిరిపోయే డైలాగ్స్ తో బండి సరోజ్ కుమార్ ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు