Kalasa Review : కలశ మూవీ రివ్యూ.. హారర్ సినిమాతో భయపెట్టిన భానుశ్రీ..

తాజాగా భానుశ్రీ మెయిన్ లీడ్ లో 'కలశ' అనే ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Bhanu shree Kalasa Movie Review and Rating

Kalasa Movie Review : బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న భానుశ్రీ(Bhanu shree)ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు టీవీ షోల్లో కనిపిస్తుంది. తాజాగా భానుశ్రీ మెయిన్ లీడ్ లో ‘కలశ’ అనే ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మాణంలో కొత్త దర్శకుడు కొండా రాంబాబు దర్శకత్వంలో భానుశ్రీ మెయిన్ లీడ్ లో సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ.. పలువురు మైఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కలశ. ఈ సినిమా నేడు డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. తన్వి(భానుశ్రీ) డైరెక్టర్ అవ్వాలని, ఓ హారర్ సినిమా తీయాలని అనుకుంటుంది. ఓ కథని తయారుచేసుకొని నిర్మాతలని కలుస్తుంటుంది. ఓ నిర్మాత కథ నచ్చింది కానీ క్లైమాక్స్ మార్చమని చెప్తాడు. ఆ మీటింగ్ తర్వాత తన్వి తన ఫ్రెండ్ కలశ(సోనాక్షి వర్మ) ఇంటికి రాత్రి పూట వెళ్తే అక్కడ కలశ ఉండదు. కాల్ చేస్తే బయటకి వచ్చానని, లేట్ అవుతుంది అని చెప్తుంది. దీంతో తన్వి అక్కడ వెయిట్ చేస్తుంటే ఆ ఇల్లు, ఇంట్లో కదలికలు తన హారర్ కథలో ఉన్నట్టే అనిపిస్తాయి. తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది తన్వికి. తెల్లారి ఆ ఇంట్లో ఉండే ఓ పనిమనిషి ఇప్పుడు ఇంట్లో ఎవరూ ఉండట్లేదు, కలశ, ఆమె చెల్లి రెండు నెలల క్రితమే చనిపోయారు అని చెప్తాడు. దీంతో తన్వి షాక్ అవుతుంది. కలశ, ఆమె చెల్లి ఎలా చనిపోయారు? తన్వి దీని గురించి ఎలా పరిశోధిస్తుంది? తన్విని గమనిస్తున్న వారెవరు? ఈ హత్యలు ఎవరు చేశారు? ఆ కేసు ఎలా డీల్ చేశారు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. మొదటి హాఫ్ అంతా అసలు కథలోకి వెళ్లకుండా భానుశ్రీ చుట్టూ, పక్కన రచ్చ రవితో కొన్ని కామెడీ సీన్స్ తో నడిపిస్తారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. కొన్ని దెయ్యం సీన్లు భయపెడుతాయి. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కలశ, ఆమె చెల్లి ఎలా చనిపోయారు? వారి కథలేంటి? వారు నిజంగానే ఆత్మలుగా మారారా? భానుశ్రీని ఆ ఇంట్లో గమనించేదెవరు? అంటూ ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సాగుతూనే హారర్ సినిమాలా మధ్యమధ్యలో భయపెడుతుంది. హారర్ సినిమాలు చూసేవారు కలశను చూడొచ్చు.

నటీనటుల విషయానికొస్తే.. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ గా చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ లో నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరకడంతో మెప్పిస్తుంది. ఇక కలశగా టైటిల్ రోల్ చేసిన సోనాక్షి శర్మ ఓ పక్క అందాలు ఆరబోస్తూనే మరోపక్క దయ్యంగా భయపెడుతుంది. పోలీస్ అధికారిగా రవివర్మ బాగా నటించారు. సమీర్, అనురాగ్.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి.

Also Read : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. హారర్ సినిమా కాబట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రేక్షకులని భయపెడుతుంది. హారర్ అంటే ఎక్కువగా చీకట్లో సన్నివేశాలు ఉంటాయని తెలిసిందే. వాటిల్లో కెమెరా విజువల్స్ తో కూడా భయపెట్టారు. నటిగా, గాయనిగా పలు రంగాల్లో పేరు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ సినిమాతో నిర్మాతగా మారి నిర్మాణ విలువలు కూడా బాగుండేలా సినిమాకు ఖర్చుపెట్టారు. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా రాసుంటే బాగుండేది అనిపిస్తుంది. కొత్త దర్శకుడు హారర్ సినిమాతో భయపెట్టాడంటే సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

మొత్తానికి ‘కలశ’ ప్రేక్షకులని థియేటర్లో భయపెడుతుంది. హారర్ సినిమాలు నచ్చేవారు థియేటర్లో ఈ సినిమాని చూసేయండి.