దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించిన బిగ్ బీ…అలా అనిపించిందట

బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బ‌చ్చన్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌  దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అమితాబచ్చన్‌ తన ఆలోచనలను అక్కడున్నవారితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ…తన పేరు అవార్డు కోసం ఎంపిక చేసిన సమయంలో తన మనసులో ఓ సందేహం పుట్టిందని అన్నారు. తాను రిటైర్ అయి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని ఇదొక హింట్ లా తనకు అనిపించిందని సరదాగా నవ్వతూ బిగ్ బీ అన్నారు. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశిర్వాదం నాతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, నన్ను ఇంతగా ఆరాదించిన భారతీయ సినిమా వీక్షకులకు, నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించిన అందరికి ధన్యవాదాలు అని బిగ్ బీ అన్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కె అవార్డు ఇవ్వడం ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా గత 50 సంవత్సరాలుగా ఈ సినిమా ప్రపంచంలో పనిచేసే భాగ్యం లభించింది. ఈ అవార్డును వినయంతో స్వీకరిస్తున్నానని బిగ్ బీ తెలిపారు.

తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరి మెంబర్లకు, ప్రసార మంత్రిత్వ శాఖకు, కేంద్ర మంత్రికి తనకు అవార్డు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బిగ్ బీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుని మొదటి సంవత్సరం దేవికారాణితో మొదలుపెట్టి ఇప్పటివరకు మొత్తం 67 మందికి అందించారు. తెలుగు నుంచి బి.ఎన్.రెడ్డి, ఎల్.వి ప్రసాద్, బి.నాగిరెడ్డి, పైడి జైరాజ్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కళాతపస్వి విశ్వనాథ్ ,బాలచందర్ లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది.