ఎన్నికలపై మోడీ బయోపిక్ ప్రభావం చూపుతుందని.. ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల చేయకూడదని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. అయితే సినిమా విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. అంతేకాదు చిత్రం విడుదలపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. దీంతో ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా పీఎం నరేంద్రమోడీ బయోపిక్ రిలీజ్ కానుంది.
ఎన్నికల సమయంలో సినిమా విడుదలవుతుంది. రిలీజ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా దీనిని పరిగణించాలి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మే 19వ తేదీన చివరి విడత ఎన్నికలు జరిగే వరకు చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కపిల్ సిబాల్, సందీప్ తో కూడిన బృందం పలుమార్లు ఈసీకి విన్నవించింది.
ఈ చిత్రం ఓటర్లను ప్రభావితం చేయదని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, చిత్ర నిర్మాత ఎన్నికల సంఘం దగ్గర వివరణ కూడా ఇచ్చారు. ఓటర్లపై ప్రభావం చూపదు.. చిత్రం నిలుపుదలపై తాము జోక్యం చేసుకోలేమని వివరణ ఇచ్చింది. ఈ సినిమా విడుదలపై తదుపరి నిర్ణయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీసుకుంటుందని తెలిపింది. మరోవైపు సీబీఎఫ్‌సీకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. మూవీ విడుదలపై సీబీఎఫ్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.