Chalapathi Rao as Tolywood Babai
Chalapathi Rao : 2022లో టాలీవుడ్ లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంతోమంది అగ్రతారలని కోల్పోయింది. రెండు రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు.
టాలీవుడ్ లో విలన్ పాత్రలకు పెట్టింది పేరాయన. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన బాణీ పలికించారు తమ్మారెడ్డి చలపతిరావు. ఇండస్ట్రీలో అందరూ బాబాయ్ అని ముద్దుగా పిలుచుకొనే ఆయన. కెరీర్ లో ఎక్కువగా బాబాయ్ పాత్రలతోనే మెప్పించి టాలీవుడ్ బాబాయ్ అనిపించుకున్నారు. తన తోటి నటీనటులతో సరదాగా ఉండడం, వారి కష్టసుఖాలు పంచుకోవడం ఆయన తత్వం. లెక్కకు మించిన సినిమాల్లో నటించి సినిమాలే తన జీవితం అంటూ బతికారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు చలపతిరావు. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. గూఢచారి 116 సినిమాతో 1966 లో సినిమాల్లోకి వచ్చారు. ఐదున్నర దశాబ్దాలపాటు తెలుగు ఇండస్ట్రీలో కొనసాగారు చలపతిరావు. ఎన్నో గొప్ప చిత్రాల్లో భాగమయ్యారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పర్చుకున్నారు.
కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా విలన్ డెన్ లో సభ్యుడిగా, కరుడుగట్టిన గూండా, రౌడీ పాత్రలను ఎక్కువగా పోషించారు. ఇంకా రేప్ సీన్స్ కు ఆయన స్పెషలిస్ట్ గా నిలిచారు. అలాంటి పాత్రలు తన కెరీర్ లో లెక్కలేనన్ని చేశారు. మూడు తరాల నటులతోనూ చలపతిరావు నటించారు. ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, చెన్నకేశవరెడ్డి, ఆది, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు చేశారు.
బందరులో పీయూసీ చదువుతున్న టైమ్ లో ప్రేమించిన అమ్మాయిని తన 19వ ఏటనే పెళ్ళి చేసుకున్నారు చలపతిరావు. అయితే ఆ తర్వాత మూడేళ్ళకే ఆమె చనిపోవడంతో మళ్ళీ పెళ్ళిచేసుకోలేదాయన. ఎన్టీఆర్, బసవతారకం ఆయన్ని పెళ్లిచేసుకోమని ఎంత చెప్పినా తాను చేసుకోలేదని చలపతిరావు చాలా సందర్భాల్లో చెప్పారు. చలపతిరావు తన తనయుడు రవిబాబు ను హీరోగా చూడాలనుకున్నారు. అయితే అనూహ్యంగా రవిబాబు నటుడిగా, మంచి డైరెక్టర్ గా ఎదిగారు.
చలపతిరావు నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’. ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శక నిర్మాత. పైగా ఈ సినిమాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాంతో చలపతిరావుతో ఎన్టీఆర్ పలు పాత్రలు పోషింప చేశారు. సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కనిపించారు చలపతిరావు. ఎన్టీ రామారావుతో అత్యధిక సినిమాల్లో నటించిన వ్యక్తిగా చలపతి రావుకు గుర్తింపు ఉంది. అంతేకాక, ఎన్టీఆర్ తో వ్యక్తిగతంగా కూడా చలపతి రావు మంచి సాన్నిహిత్యం ఉంది. నందమూరి ఫ్యామిలీలో ఏ శుభకార్యం జరిగినా చలపతిరావు హాజరయ్యేవారు. చలపతి రావు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి మూడు తరాల హీరోలు, నటీనటులతో కలిసి పని చేశారు.
Chiranjeevi : చలపతి బాబాయ్ ఆత్మకు శాంతి చేకూరాలి..
‘గులాబి’లో హీరోయిన్ తండ్రి పాత్రను ఇచ్చారు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్ళాడతా’లో హీరో నాగార్జునకు తండ్రిగానూ చలపతిరావు నటించారు. ఆ సినిమా కూడా విజయం సాధించడంతో చలపతిరావుకు అనేక సినిమాల్లో తండ్రిగా నటించే అవకాశాలు వరుసగా లభించాయి. ఆది సినిమాలో ఎన్టీఆర్ కి బాబాయ్ గా అదరగొట్టేసారు. అప్పట్నుంచి బాబాయ్ గా కూడా చాలా పాత్రలు చేశారు. కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో మళ్ళీ నిర్మాణం జోలికిపోలేదు చలపతిరావు.
డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ ఎన్నో సినిమాల్లో చలపతిరావుకు వెరైటీ రోల్స్ ఎన్నో ఆఫర్ చేసేవారు. కామెడీ ప్లస్ సీరియస్ రోల్స్ లో ఆయన నటించిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. చలపతిరావు ఆఖరి సినిమా నాగార్జున ‘బంగార్రాజు’ తో పాటు ఓ మనిషి నీవెవరు అనే చిన్న సినిమాలో నటించారు. ఆ తర్వాత చలపతి మరో సినిమాలో నటించలేదు. చలపతిరావు మృతి టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.