Yevam Review : ‘యేవమ్’ మూవీ రివ్యూ.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి మెప్పించిందా?

ఈ సినిమాలో చాందిని చౌదరి మొదటిసారి పోలీసాఫీసర్ రోల్ లో నటించింది.

Yevam Movie Review : చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చాందిని చౌదరి మొదటిసారి పోలీసాఫీసర్ రోల్ లో నటించింది. నేడు జూన్ 14న యేవమ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. వికారాబాద్ లో పోలీస్ స్టేషన్ లో సౌమ్య(చాందిని చౌదరి)కి పోలీస్ ఉద్యోగం వస్తుంది. ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు ఆడపిల్లకు పోలీస్ ఎందుకు అని ఎగతాళి చేసినా పట్టించుకోకుండా పోలీస్ అవుతుంది. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు అభిమానం. మరోవైపు యుగంధర్(వశిష్ట సింహ) హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేసి కలుస్తూ ఉంటాడు. ఓ సారి ఒక అమ్మాయి మర్డర్ జరగడం, అంతకుముందు ఓ కేసుతో.. ఎవరో హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నాడని పోలీసులకు తెలిసి జాగ్రత్త పడమని అందరికి చెప్తారు.

ఓ అమ్మాయికి అలాంటి ట్రాప్ రావడంతో సౌమ్య ఆ అమ్మాయి బదులు వెళ్తుంది కానీ యుగంధర్ తనని చూసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పి సౌమ్యకి యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ జరగడంతో సౌమ్య, అభి మరింత దగ్గరవుతాడు. కానీ అభికి పెళ్ళయిపోయిందని, తన భార్య(అషురెడ్డి) తనని వదిలేసి వెళ్లిపోయిందని చెప్తాడు. మరి పోలీసులు యుగంధర్ ని పట్టుకున్నారా? యుగంధర్, అభికి సంబంధం ఏంటి? అభి భార్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? సౌమ్య ఈ కేసు ఎలా డీల్ చేసింది? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Maharaja : ‘మహారాజ’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ కొద్దిసేపు స్లోగా సాగుతుంది. సౌమ్య పోలీస్ గా జాయిన్ అవ్వడం, సౌమ్య – అభి మధ్య సీన్స్, యుగంధర్ అమ్మాయిలని ట్రాప్ చేయడం చూపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారు. సెకండ్ హాఫ్ యుగంధర్ ని ఎలా పట్టుకుంటారు అనే కాన్సెప్ట్ తోనే ఆసక్తిగా సాగుతుంది. పోలీస్ అంటే పవర్ ఫుల్ యాక్షన్ అని ఊహిస్తాము కానీ చాందిని ఒక ఆడపిల్ల పోలీస్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనే మాములు పాత్రలో నటించి చివర్లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లో కనిపిస్తుంది. అయితే విలన్ ఎవరో ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లోనే చూపించినా పోలీసులకు తెలీదు కాబట్టి ఎలా పట్టుకుంటారు అనేది ఆసక్తిగా నడిపించారు. క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది. తెలంగాణ ఒగ్గు కథని కథలో పర్ఫెక్ట్ గా ఇమడ్చి చూపించారు. ఒగ్గు కథ విజువల్ గా, వినడానికి కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఒక సాధారణ ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది అని చూపిస్తూనే యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది చాందిని చౌదరి. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. భరత్ రాజ్ కూడా తన నటనతో మెప్పించాడు అని చెప్పొచ్చు. అషురెడ్డి కాసేపే కనిపించినా తన అందంతో అలరిస్తూనే నెగిటివ్ షేడ్ లో మెప్పిస్తుంది. గోపరాజు రమణ, మిగతా పాత్రలు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సెట్స్ స్పెషల్ గా వేయడానికి బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. కథ కథనం కొత్తగానే ట్రై చేసి దర్శకుడు పర్వాలేదనిపించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘యేవమ్’ సినిమా ఓ ఆడపిల్ల పోలీసాఫీసర్ అయితే కష్టమైనా ఓ కేసు ఎలా డీల్ చేసింది అని ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు