చూసీ చూడంగానే – రివ్యూ

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం.. ‘‘చూసీ చూడంగానే’’ రివ్యూ..

  • Publish Date - January 31, 2020 / 11:59 AM IST

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం.. ‘‘చూసీ చూడంగానే’’ రివ్యూ..

‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా జాతీయ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ అవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చూసీ చూడంగానే’ ఎలా ఉందో చూద్దాం..

ప్రేమ చాలా సంక్లిష్టమైన స్థితి. ప్రేమించిన వారికి ప్రేమించిన సంగతి చెప్పడానికి సంకోచిస్తుంది. ఎందుకంటే తన ప్రేమను ఎక్కడ వారు కాదంటారో అనే ఆందోళనతో వాయిదా వేస్తూ పోతారు ప్రేమికులు. ఈ క్రమంలో తమను తాము కాల్చేసుకుంటూ ఉంటారు. ఆత్రేయ అన్నట్టు ఆకాశం, అనురాగం రెండూ ఒకే సారి పుట్టాయి. అలాగే ఆవేశం ఏనాడు తెలిసిందో అప్పుడే ప్రేమ పుట్టిందనే సంగతి కూడా తెలుస్తుంది. ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నైజాన్నిచ్చే ప్రేమ … కేవలం ప్రేమించిన వారి ముందు దాన్ని వ్యక్త పరచడానికి మాత్రం సరిపడా ధైర్యాన్ని ఇవ్వదు.

దీన్ని మూగ ప్రేమ అని అనుకుని సర్దుకుపోతూంటారు. కానీ నిజానికి ప్రేమ ఒక ధైర్యం కావాలి తప్ప బలహీనత కాకూడదు. వలచుట తెల్సిన హృదయానికి మరచుట మన్నించుట కూడా తెలియాలి. ప్రేమను చెప్పి అవతల వారు ఆ ప్రేమను కాదంటే దాన్ని కూడా సమానంగా స్వీకరించగలిగే మానసిక స్థైర్యం ఉన్నప్పుడే ప్రేమించాలి. కానీ ప్రేమకు గుణింతాలూ ఫార్ములాలు ఉండవు. అది అలా పుట్టేస్తుందంతే …ఇదే పాయింట్ మీద ఇప్పటికి వందలాది సినిమాలు వచ్చాయి. అదే కోవలో ఇప్పుడు ‘చూసీ చూడంగానే’ అనే సినిమా కూడా వచ్చింది.

Read Also : అశ్వథ్థామ – రివ్యూ

హీరో శివ పెద్దగా తడుముకోకుండా నటించాడు.అయితే సినిమా టోటల్‌గా వర్ష బొల్లమ్మ అనే నటిది. హీరో సిద్దూని మూగగా ప్రేమించిన అమ్మాయిగా తను చాలా బాగా నటించింది.
తెలుగు తెరకు ఓ మంచి నటిని పరిచయం చేసినందుకు రాజ్ కందుకూరిని అభినందించాలి. ప్రేమ సినిమా అనగానే పాటల మీద ఆధారపడిపోవడం అనే మన సాంప్రదాయ పద్ధతి నుంచి బయటకు వచ్చి సన్నివేశాలతో సినిమాను నడిపించిన డైరెక్టర్ శేష సింధూరావు టేకింగ్ మీద పట్టుందనిపించింది.

కథగా చెప్పుకోడానికి ఏమీ లేకపోయినా ఓ ఫీల్ క్యారీ చేసుకుంటూ వెళ్లడానికి నటీనటులతో కలిసి దర్శకురాలు పడ్డ కష్టం. దాన్ని మరింత రక్తి కట్టించడానికి సంగీత దర్శకుడు, కెమెరా‌మెన్ కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ బయటకు వచ్చేసిన తర్వాత కూడా గుర్తుండేది మాత్రం వర్ష నటనే. అదే ఈ సినిమాను రక్షించాలి.
ప్లస్ పాయింట్స్
వర్ష నటన
హీరో హీరోయిన్ల మద్య కెమిస్ట్రీ
గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ 
మైనస్ పాయింట్స్
స్లోగా అనిపించిన నేరేషన్
బాగా తెలిసిన కథ కావడం
అంతే తెలిసిన సన్నివేశాలు కావడం