Deepika Padukone : మంచి మనసు చాటుకున్న దీపికా.. చికిత్స కోసం ఆర్ధిక సాయం
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకుణె మంచి మనసు చాటుకున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యాసిడ్ దాడి బాధితురాలి వైద్యానికి రూ.15 లక్షల ఆర్ధిక సాయం చేశారు.

Deepika Padukone
Deepika Padukone : సాయం చేయడంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ముందుటారు. కొందరు ట్రస్టులు ప్రారంభించి పేద ప్రజలకు సాయం చేస్తుంటారు. ఇంకొందరు అడిగి వచ్చిన వారికి కాదనకుండా ఇస్తుంటారు.. ఆ కోవలోకి చెందిన నటే దీపికా పదుకొణె.. సాయంకోరి వచ్చిన వారిని వట్టిచేతులతో పంపించదని చాలామంది చెబుతుంటారు. అంతే కాదు ఎవరైనా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకునేందుకు ఈ అమ్మడు ముందుంటారని టాక్.. తాజాగా యాసిడ్ దాడి బాధితురాలు బాల ప్రజాపతికి దీపికా రూ.15 లక్షల ఆర్ధిక సాయం చేసింది. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న బాల ప్రజాపతి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలోకి రావడంతో మూత్రపిండాల మార్పిడి చేయాలనీ వైద్యులు సూచించారు. ఇందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో ఆమె కోసం ఫండ్ రైస్ చేసేందుకు యాసిడ్ బాధితుల కోసం పనిచేస్తున్న Chhanv Foundation ముందుకు వచ్చింది. నిధుల సేకరణ ప్రారంభించింది. ఈ విషయం దీపికా దృష్టికి వెళ్లడంతో తనవంతు సాయంగా రూ.15 లక్షలను Chhanv Foundation కు అందించి మంచి మనసు చాటుకుంది.
కాగా 2012 వరకు బాల ప్రజాప్రతి అందరిలాగే చలాకీగా ఉండేది. కుటుంబ తగాదాలతో బాల ప్రజాపతి, ఆమె తాతపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తాత మృతి చెందగా.. తీవ్ర గాయాలతో దీపికా ప్రాణాలతో బయటపడింది. ఆమె మొహం గొంతు భాగాలు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఆమెకు 12 సర్జరీలు చేశారు వైద్యులు. రెండు మూడేళ్లు ఆసుపత్రుల చుట్టూనే తిరిగారు బాల.. వైద్యుల కృషితో ఆమె సాధారణ స్థితికి వచ్చారు.
కానీ వ్యాధినిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అప్పుడప్పుడు అనారోగ్యం భారిన పడుతుండేవారు. ఇక తాజాగా ఆమె మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని వైద్య పరీక్షల్లో తేలింది. సర్జరీ చేయనిదే సమస్య పరిష్కారం కాదని డాక్టర్లు తేల్చేశారు. ఆమె విషయం తెలిసిన చాలామంది సర్జరీకి డొనేషన్స్ ఇస్తున్నారు. వారిలో దీపికా కూడా చేరిపోయారు.