NCB ముందు ఆ నలుగురు హీరోయిన్లు అదే చెప్తున్నారు: అది మత్తు పదార్థం కాదట

NCB:సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి తర్వాత డ్రగ్స్‌ కోణంలో విచారణ జరుపుతుంది NCB(నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో). ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సారా అలీఖాన్‌లను ఇంటరాగేట్ చేశారు అధికారులు. అందులో ఆ నలుగురు చెప్పిన మాటలు ఒకేలా ఉన్నాయట. ‘హ్యాష్‌’ అనే పదార్థం తీసుకున్న మాట వాస్తవమే కానీ, అది మత్తు పదార్థం కాదని వినిపిస్తున్నారు.




వీరి విచారణ తర్వాత మరికొందరు ప్రముఖులకు కూడా విచారణ తప్పేలా లేదు. వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే ఎన్‌సీబీ అధికారుల ఇంకొంచెం ముందుకు కదుపుతున్నారు. హీరోయిన్లను కూడా మరోసారి ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుత అంశాలపై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా, సమీర్‌ వాంఖడే, అశోక్‌ జైన్‌ రూపొందించిన డిటైల్డ్ రిపోర్ట్ పై ఆదివారం రాత్రి ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్‌ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు 6నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్‌ సరఫరాదారులపై ఎన్‌సీబీ కన్నేసింది.




వినిపిస్తున్న కరణ్ పేరు:
సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు బాలీవుడ్ డైరక్టర్ కరణ్‌ జోహార్‌ వరకూ వెళ్లేలా కనిపిస్తుంది. రియా చక్రవర్తి–క్షితిజ్‌ రవి ప్రసాద్‌ తరఫు లాయర్‌ సతీశ్‌ మనేషిండే. ఈ కేసులో కరణ్‌ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్‌ జోహార్‌ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్‌ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్‌ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు.