Ramayana : ‘రామాయణం’లో ట్విస్ట్ ఏంటి బ్రో..? డైరెక్టర్ పై విమర్శలు..

రామాయణం అందరికి తెలిసిన కథ. (Ramayana)

  • Published on- July 28, 2026 / 03:54 PM IST

Ramayana

Ramayana : బాలీవుడ్ లో రామాయణంపై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా రామాయణ పేరుతో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. డి‌నెగ్ లాంటి హాలీవుడ్ సంస్థలు కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నాయి. ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. రామాయణ పార్ట్ 1 ఈ సంవత్సరం దీపావళికి, పార్ట్ 2 వచ్చే సంవత్సరం దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ నితీష్ తివారి తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రామాయణ పార్ట్ 1 ఒక క్లిఫ్ హ్యాంగర్ (ట్విస్ట్) తో ముగుస్తుంది. ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు పార్ట్ 2 ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసే ఫీలింగ్ లో ఉంటారు అని అన్నారు. దీంతో నితీష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sai Pallavi : మళ్ళీ బిజీ అవుతున్న సాయి పల్లవి.. లైనప్ మాములుగా లేదుగా..

రామాయణం అందరికి తెలిసిన కథ. మన భారతదేశంలో అయితే చిన్నపిల్లలను అడిగినా రామాయణ కథ చెప్తారు. క్లిఫ్ హ్యాంగర్ లేదా ట్విస్ట్ అంటే ఏమి తెలియని కథలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠ కలిగించేలా ఉండాలి. ఉదాహరణకు బాహుబలి పార్ట్ 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడుస్తాడు అనేది అతిపెద్ద ట్విస్ట్. అందుకే పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూసారు. అక్కడ బాహుబలి కథ ఎవరికీ తెలియదు.

కానీ రామాయణంలో దశరథ మహారాజు నుంచి రావణాసురుడిని చంపి రాముడు సీతమ్మతో అయోధ్యకు తిరిగివచ్చేవరకు అందరికి తెలిసిన కథే. అయోధ్యకు తిరిగి వచ్చాక సీతమ్మ అడవులకు వెళ్లడం, లవకుశ జననం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రామావతారం పరిసమాప్తి కూడా గతంలో అనేక సినిమాల్లో చూపించేసారు.

Also Read : Rao Bahadur OTT : ఓటీటీలోకి సత్యదేవ్ ‘రావు బహదూర్’.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

ఇలా అందరికి తెలిసిన కథలో ట్విస్ట్ లు ఏమిస్తారు? పార్ట్ 1 ముగింపులో ట్విస్ట్ ఏముంటుంది? పార్ట్ 2 కోసం అంతగా ఎదురుచూసే క్లిఫ్ హ్యాంగర్ అందరికి తెలిసిన రామాయణంలో ఏముంది అని నెటిజన్లు డైరెక్టర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఓం రౌత్ లాగా ఆది పురుష్ తీసినట్టు తీయరు కదా అని ట్రోల్ చేస్తున్నారు. మరి రామాయణంలో ఏం ట్విస్ట్ చూపిస్తారో దర్శకుడికే తెలియాలి. లేదా సినిమా వచ్చేదాకా మనం ఎదురుచూడాలి.

ఇక ఈ సినిమాలో అరుణ్ గోవిల్ దశరథ మహారాజుగా, శోభన కైకేయి పాత్రలో, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.