Director Sukumar Planting An Oxygen Plant In Razole
Oxygen Plant in Razole: కరోనా కష్టకాలంలో సొంతూరుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు డైరెక్టర్ సుకుమార్. కరోనా కారణంగా ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ దగ్గర రాజోలు గ్రామంలో రూ.40 లక్షలు ఖర్చు పెట్టి డీఓసీఎస్ 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్‌ను తన స్వస్థలంలో ఏర్పాటు చేస్తున్నారు రాజోలులో.
కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడానికి ఇప్పటికే ముందుకు వచ్చిన సుకుమార్.. రాజోలులో ప్లాంట్ నిర్మాణం చేపట్టి నాలుగురోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలుత రూ.25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలని భావించినా.. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్ తయారుచేసుకోవచ్చనే ఉద్దేశంతో మరో రూ.15 లక్షలు జత చేసి మొత్తం రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని సుకమార్ స్నేహితుడు అమలాపురం పంచాయతీరాజ్ డీఈఈ అన్యం రాంబాబు మీడియాకు తెలిపారు. సుకుమార్ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరుకు కొంతైనా సేవ చేసేందుకు మిగిలినవారు కూడా ముందుకు రావాలని అంటున్నారు.