×
Ad

Lawrence Bishnoi : ముంబైలో మాఫియా మళ్లీ యాక్టివ్ అయిందా..? బాలీవుడ్ ని టార్గెట్ చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌.. అసలు ఎవరితను?

ఇంతకీ ఎవరీ లారెన్స్‌ బిష్ణోయ్ మారుమూల గ్రామంలో పుట్టిన ఈ గ్యాంగ్‌స్టర్‌ నేర ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాడు అసలు ఇప్పుడు బాలీవుడ్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు.(Lawrence Bishnoi)

  • Published On : February 21, 2026 / 07:10 AM IST

Lawrence Bishnoi

Lawrence Bishnoi : ముంబై అంటే మాఫియా పేరు వినిపించేది ఒకప్పుడు. దాన్నుంచి బయటపడి మెల్లిగా ఏదోలా బతికేస్తున్న ముంబైని ఒకడు ఏలేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడో జైల్లో ఉండి ఇక్కడ చక్రం తిప్పుతూ అండర్‌ వరల్డ్ కి నయా డాన్‌గా మారాడు. మాఫియా లేదు, ఇక రాదు అని ఊపిరి పీల్చుకుంటున్న ముంబైకి మళ్లీ భయాన్ని పరిచయం చేస్తున్నాడు. అతడే లారెన్స్‌ బిష్ణోయ్‌. బాలీవుడ్‌ను వరుసగా టార్గెట్‌ చేస్తూ సెలబ్రిటీలకు మళ్లీ నిద్రలేని రాత్రులు మిగిలిస్తున్నాడు. ముంబైలో మాఫియా మళ్లీ యాక్టివ్ అయిందా అనే సందేహాలను కలిగిస్తుంది. గతంలో దావూద్.. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌.. ఇద్దరికి తెలిసింది నేరాలే. మాఫియాను విస్తరించడంలో ఇద్దరి మధ్య ఎన్నో పోలికలు. పంజాబ్‌కు మాత్రమే పరిమితం అయిన బిష్ణోయ్‌ గ్యాంగ్ ఇప్పుడు సగం ప్రపంచానికి పాకింది. ఇంతకీ ఎవరీ లారెన్స్‌ బిష్ణోయ్ మారుమూల గ్రామంలో పుట్టిన ఈ గ్యాంగ్‌స్టర్‌ నేర ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాడు అసలు ఇప్పుడు బాలీవుడ్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు.(Lawrence Bishnoi)

1970 నుంచి దాదాపు 30ఏళ్లు.. అండర్‌వరల్డ్ ఆడించినట్లు ఆడింది ముంబై. కరీంలాలా నుంచి వరదరాజన్‌ ముదలియార్‌, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌, అరుణ్‌ గౌలి, అమర్‌ నాయక్‌.. ఇలా ఎంతో మంది అండర్‌వరల్డ్ సామాజ్రాన్ని ఏలారు. వాళ్లలో దావూద్ పేరు చెప్తే ముంబై ఇప్పటికీ ఉలిక్కిపడుతుంటుంది. చాలా ఏళ్ల ప్రయత్నాలు, వ్యూహాల తర్వాత ముంబై నుంచి మాఫియాను దూరం చేశారు పోలీసులు. కానీ ఇప్పుడు ఒకడు మళ్ళీ సవాల్ విసురుతున్నాడు. అలా ఇలా కాదు మరో దావూద్ లా ఎదుగుతున్నాడు. అతడే లారెన్స్ బిష్ణోయ్‌. అచ్చూ దావూద్‌లా నేర సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ, విస్తరిస్తూ ముంబై వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

Also Read : Prabhas : విజయవాడలో బండి మీద.. ప్రభాస్ పునుగుల ఎమోషన్ తెలుసా?

గతంలో దావూద్ పేరు చెప్తే బాలీవుడ్ వణికిపోయేది. ఇప్పుడు బిష్ణోయ్ కూడా అలాంటి భయమే క్రియేట్ చేస్తున్నాడు. కొన్ని నెలలుగా స్టార్ సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకొని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించడమే కాదు డైరెక్ట్‌గా సెలబ్రిటీల ఇళ్లే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన గ్యాంగ్‌ అతన్ని హత్య చేస్తామంటూ బెదిరించింది కూడా. దీంతో బాలీవుడ్‌ యాక్టర్లను బిష్ణోయ్ భయం వెంటాడుతోంది. జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది ఇతనికి.

దురంధర్ మూవీ సూపర్ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్న రణ్‌వీర్‌ సింగ్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. పదికోట్ల రూపాయలు ఇవ్వాలి లేదంటే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రణ్‌వీర్‌ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రమే కాదు అమీర్‌ఖాన్‌, షారుఖ్‌లాంటి హీరోలకు కూడా బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై ఏకంగా కాల్పుల జరిపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి ఒకటి తెల్లవారుజామున ముంబైలోని జుహూలో రోహిత్ శెట్టి నివాసంపై దుండగులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కేసులో 12మందిని అరెస్ట్ చేయగా దీని వెనక బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు శుభం లోంకర్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో బాలీవుడ్‌ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం స్టార్ట్ అయింది. నిజానికి కొన్నేళ్లుగా బిష్ణోయ్ గ్యాంగ్ పేరు బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. దీంతో అండర్‌ వరల్డ్ మళ్లీ అవతరించబోతోందా అనే అనుమానం, ఆందోళన మొదలైంది. ఒకప్పుడు అండర్‌ వరల్డ్ చేతిలో కీలుబొమ్మలా కనిపించేది బాలీవుడ్. ఆ తర్వాత తగ్గింది. ఇప్పుడు వస్తున్న బెదిరింపు ఘటనలు బాలీవుడ్‌ను మరోసారి అలర్ట్ చేసింది.

Also Read : Nawab Cafe Review : ‘నవాబ్ కేఫ్’ మూవీ రివ్యూ.. ఓ చాయ్ షాప్ ఎమోషన్..

హీరో సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన కొత్తలో బిష్ణోయ్ పేరు పెద్దగా వినిపించింది. కృష్ణజింక కేసుకు సంబంధించి 2018లో సల్మాన్‌ను చంపేస్తామని వార్నింగ్‌లు వచ్చాయ్‌. అతని ఇంటి దగ్గర రెక్కీ చేసిన ఘటన కూడా బయటపడింది. 2022లో సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సల్మాన్‌తో స్నేహం చేస్తున్నారని కెనాడలో సింగర్‌ గిప్పీ గ్రేవాల్ ఇంటిపై దాడి జరిగింది. తర్వాత బాబా సిద్దీకీ హత్య బాధ్యత కూడా ఈ గ్యాంగ్ తీసుకుంది. మునావర్‌ ఫారూఖీ, కపిల్ శర్మలాంటి ప్రముఖుల పేర్లు కూడా బెదిరింపుల జాబితాలో వినిపించాయ్‌.

లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. ఐతే బయట జరిగే ఈ సంఘటనలు మరింత భయపెడుతున్నాయ్‌. ఇక అటు బిష్ణోయ్‌ ముఠా కోసం పనిచేస్తోన్న లేడీ డాన్‌ ఖుస్నుమా అన్సారీ అలియాస్‌ నేహను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బిష్ణోయ్‌, హషీమ్‌ బాబా ముఠాలకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్‌కు ఈమె స్నేహితురాలు. కటకటాల వెనక నుంచే ముఠాను ఆపరేట్‌ చేస్తున్నాడు. లారెన్స్‌పై దాదాపు 70 కేసులు ఉన్నాయ్‌. కొన్నేళ్లుగా అతను జైల్లోనే ఉన్నాడు.

Lawrence Bishnoi

అయితే జైలులోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పుడూ తన అనుచరులతో టచ్‌లో ఉంటాడని తెలుస్తోంది. పొలిటీషియన్లనే కాదు బాలీవుడ్‌ను కూడా ఒంటి చేత్తో వణికిస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివి పంజాబ్ యూనివర్సిటీ DAV కాలేజీలో చేరి అక్కడే నేషనల్ రేంజ్ అథ్లెట్‌గా, స్టూడెంట్ లీడర్‌గా ఎదిగాడు. లా పూర్తి చేశాక గోల్డీబ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం పెంచుకుని సంఘ వ్యతిరేక శక్తిగా మారాడు. గ్యాంగ్‌వార్‌లో ప్రియురాలు సజీవదహనం కావడంతో హార్డ్‌కోర్ క్రిమినల్‌గా మారాడు. గోల్డ్ బ్రార్‌, సచిన్ థాపన్‌, అన్మోల్ బిష్ణోయ్‌, విక్రమ్‌ జిత్ సింగ్‌, కాలా జాత్రీ, కాలా రానా.. ఈ క్రిమినల్స్ సాయంతో గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు.

Also Read : Bookie Review : ‘బూకీ’ మూవీ రివ్యూ.. సాగదీసిన బ్రేకప్ కథ.. మంచు లక్ష్మి నటించిన తమిళ సినిమా ఎలా ఉందంటే..

పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌తో పాటు అమెరికా, అజర్‌ బైజాన్, పోర్చుగల్, అరబ్‌, రష్యా వరకూ ఈ గ్యాంగ్‌ విస్తరించింది. సోషల్‌ మీడియా వేదికగా యువకులకు గాలం వేసి.. తమ గ్యాంగ్‌లో చేర్చుకుంటుందీ గ్యాంగ్‌. బిష్ణోయ్ గ్యాంగ్‌లో 7వందలకు పైగా పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 3వందల మంది పంజాబ్‌కు చెందినవారని తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16మంది గ్యాంగ్‌స్టర్లపై ఇప్పటికే NIA కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. గోల్డీ బ్రార్.. కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తున్నాడు. రోహిత్ గోద్రా…. రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్‌ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్ణోయ్… పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు కమాండ్‌గా ఉన్నాడు.

ఈ ముఠాకు మధ్యప్రదేశ్‌లోని మాల్వా, మీరట్, ముజఫర్‌నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్‌లోని ముంగేర్, ఖగారియా నుంచి ఆయుధాలు వచ్చి చేరుతుంటాయ్‌. ఒకప్పుడు ముంబై అండర్‌వాల్డ్‌ను ఏలిన దావూద్‌లా ఇప్పుడు బిష్ణోయ్‌ కనిపిస్తున్నాడు. బాలీవుడ్‌ను టార్గెట్‌ చేసేది కూడా అందుకే. ఒకప్పుడు దావూద్‌ కనుచూపులతోనే బాలీవుడ్‌ నడిచేది. ఇప్పుడా స్థానం కోసం బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రయత్నాలు చేస్తుందా అంటే అవును అనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయ్‌. నిజానికి దావూద్‌, బిష్ణోయ్‌ నేర ప్రవృత్తి ఒకేలా కనిపిస్తుంది. చిన్న చిన్న నేరాలు చేస్తూ దావూద్ అండర్‌ వరల్డ్ డాన్‌గా ఎదిగాడు. బిష్ణోయ్‌ క్రిమినల్‌ కెరీర్‌ దాదాపు సేమ్‌. దావూద్‌ భయం క్రియేట్ చేసి ఆ భయం చుట్టూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇప్పుడు బిష్ణోయ్ కూడా జైల్లో ఉంటూ తన గ్యాంగ్‌కు డైరెక్షన్స్ ఇచ్చి పని పూర్తి చేయించి భయం సృష్టిస్తున్నాడు. బిష్ణోయ్ ఇప్పుడు మరో దావూద్ అనిపిస్తున్నాడు. ఇదే ముంబైని భయపెడుతోంది.