Telangana Movie Tickets : టికెట్ ధరలపై తెలంగాణలో థియేటర్ల వార్.. ప్రభుత్వ జీఓపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం!
Telangana Movie Tickets : సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
- Sreehari A
- Updated on- August 20, 2026 / 04:54 PM IST
Telangana Movie Tickets
- సినిమా టికెట్ రేట్లపై సర్కార్ వర్సెస్ ఎగ్జిబిటర్లు..
- తెలంగాణ ప్రభుత్వ జీఓపై థియేటర్ యాజమాన్యాల ఆందోళన
- త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాయనున్న ఎగ్జిబిటర్స్
Telangana Movie Tickets : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. ఇటీవలే జారీ చేసిన జీఓ నెం.77పై థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా టికెట్ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఎగ్జిబిటర్లు ఖండించారు. టికెట్ ధరలను ఖరారు చేసే విధానం, థియేటర్లకు వర్తించే నిబంధనలను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాశారు. జీఓ అమలుకు ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అన్ని ప్రధాన స్టేక్‌హోల్డర్లతో విస్తృతంగా చర్చలు జరపాలని ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫిల్మ్ ఛాంబర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మూవీ టికెట్ ధరలపై ఛాంబర్ ఆందోళన :
కొత్తగా ‘స్పెషల్ థియేటర్’ కేటగిరీ నిబంధనలు, సవరించిన టికెట్ ధరల నిర్మాణంపై ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఈ మార్పుల ప్రభావం తీవ్రంగా పడుతుందని పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ త్వరలో ముఖ్యమంత్రికి లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించేందుకు పది రోజుల గడువు ఇవ్వనుంది. అప్పటికీ పరిష్కారం లభించని పక్షంలో కోర్టును ఆశ్రయించే యోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు సమాచారం.
పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించాలని, అందరికీ ఆమోదయోగ్యమైన టికెట్ ధరలు, నిబంధనలను రూపొందించాలని ఫిల్మ్ ఛాంబర్ కోరుతోంది.
