Telangana High Court : ‘కళ్యాణలక్ష్మి, షాదీముబారక్’పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఆర్థిక పరిస్థితిపై హెచ్చరిక!
Telangana High Court : ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందక అనేకమంది తీవ్ర అవస్థలకు గురవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని హెచ్చరించింది.
Telangana High Court
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
- స్టే ఎత్తివేతకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
- డేంజర్ బెల్స్ మోగుతున్నాయని హెచ్చరిక
Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాలపై విచారణ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేతకు నిరాకరించింది.
ఈ పథకాలకు చట్టబద్ధమైన ఆధారం ఏంటి? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ప్రజాధనాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని న్యాయస్థానం ప్రశ్నించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైనా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని (Telangana High Court) హెచ్చరించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అందక చాలామంది అవస్థలు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ప్రజాధనం ఖర్చు చేసే పథకాల ప్రాధాన్యతను పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వాస్తవానికి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ రెండు పథకాలు 2014లో ప్రారంభమయ్యాయి.
పథకాలపై విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి వచ్చే ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే మార్గాలను కోర్టు ప్రస్తావించింది. ప్రజల టాక్స్లతో వచ్చే డబ్బులు ఉచిత పథకాలకు వాడటం న్యాయమేనా? అని ప్రశ్నించింది.
భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపులపై కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సమర్పించిన అఫిడవిట్‌పై కూడా కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పథకాల చట్టబద్ధత, ప్రభుత్వ ఉత్తర్వులు, నిధుల వినియోగంపై స్పష్టత కోరుతూ తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
