Get Well Soon: సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్ విజయవంతం

  • Publish Date - May 24, 2020 / 05:04 AM IST

తెలుగు సినిమా కథ, పాటల రచయితగా సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ఆయన అనారోగ్యానికి గురికాగా, గచ్చిబౌలిలోని ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స చేయించుకున్నారు.

గత కొంతకాలంగా సుద్దాల కాలేయ సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ ఉండగా, కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించగా.. నిన్న(23 మే 2020)  ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది.

అదే సమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. అనంతరం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్లకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

1960, మే 16 న నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టారు అశోక్ తేజ. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు హనుమంతు.