మన రాత మనమే రాసుకోవాలంటున్న కీర్తి సురేష్..

  • Publish Date - August 15, 2020 / 04:55 PM IST

‘మహానటి’తో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న న‌టి కీర్తి సురేశ్‌. ఒక వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే.. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ న‌టిస్తోన్న చిత్రాల్లో ‘గుడ్ ల‌క్ స‌ఖి’ ఒక‌టి. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను స్టార్ హీరో ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. జాతీయ అవార్డు గ్ర‌హీత న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.



ఇందులో కీర్తి సురేశ్ రైఫిల్ షూట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఓ పల్లెటూరిలో అంద‌రూ బ్యాడ్ లక్‌గా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయ‌స్థాయి రైఫిల్ షూట‌ర్‌గా ఎదిగింద‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. జ‌గ‌ప‌తిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్ర‌లో క‌నిపిస్తే.. కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్ర‌లో ఆది పినిశెట్టి న‌టించారు.



సినిమా నేప‌థ్యం, కీర్తి పాత్ర ఏంటి? అనే విష‌యాల‌ను ఈ టీజ‌ర్‌లో క్లియ‌ర్‌గా చూపించారు. కీర్తి మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నారని అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.