అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధర రూ.200.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ.. పూర్తి వివరాలు

ఇటీవల ప్రముఖ కన్నడ నటులు-నిర్మాతలు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి వారు కన్నడ కంటెంట్‌ కోసం పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలు తమకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు.

కర్ణాటక వ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు సహా అన్ని థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధర రూ.200గా ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ ప్రారంభిస్తామని చెప్పారు.

ఇవాళ సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను రూ.4,08,647 కోట్లతో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా సినిమా ప్రమోషన్స్‌పై కూడా మాట్లాడారు. సినీ రంగానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

సినీ ఫీల్డ్‌ను ప్రోత్సహించడానికి టికెట్‌ ధరను రూ.200గా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అంతేకాదు, కన్నడ మూవీలను ప్రమోట్‌ చేయడానికి సర్కారు ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫాంను కూడా తీసుకువస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మైసూర్‌లో ఫిల్మ్‌ సిటీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించారు.

ఇటీవల ప్రముఖ కన్నడ నటులు-నిర్మాతలు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి వారు కన్నడ కంటెంట్‌ కోసం పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలు తమకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరమవా స్టూడియోలో 2024 జూలైలో కన్నడ వెబ్ సిరీస్ ‘ఏకం’ను కస్టమ్ ప్లాట్‌ఫాంలో ప్రసారం చేశారు. వారికి ఓటీటీ ప్లాట్‌ఫాం దక్కలేదు.

మరోవైపు, సిద్ధరామయ్య కర్ణాటక సామాజిక, చారిత్రక, సాంస్కృతిక విలువలను వర్ణించే సినిమాల కోసం డిజిటల్, డిజిటలేతర ఫార్మాట్‌లలో కన్నడ చిత్రాల రిపోజిటరీ కోసం రూ.3 కోట్లు కేటాయించారు.

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇస్తామని, పారిశ్రామిక విధానం కింద అందించే సౌకర్యాలను దీనికి కూడా విస్తరిస్తామని సిద్ధరామయ్య చెప్పారు. బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో కర్ణాటక ఫిల్మ్ అకాడమీ యాజమాన్యంలోని 2.5 ఎకరాల భూమిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ కాంప్లెక్స్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.