105 Minutes Movie Review : 105 మినిట్స్ రివ్యూ.. ఒక్కటే పాత్రతో రెండు గంటలు..

105 మినిట్స్‌లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక భయపడుతూ మనల్ని భయపెడుతుంది.

105 Minutes Movie Review : సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక(Hansika) మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా 105 మినిట్స్. నూతన దర్శకుడు రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లో బొమ్మక్ శివ నిర్మాణంలో ఈ 105 మినిట్స్ సినిమా తెరకెక్కింది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా ఒక్క క్యారెక్టర్ తోనే నడుస్తుంది. జాను(హన్సిక) రాత్రి పూట ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ సమయంలోనే కారులో భయానకంగా అనిపిస్తుంది జానుకి. ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఎవరో ఉన్నట్టు, తనని ఎవరో భయపెడుతున్నట్టు జానుకి అనిపిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే కూడా కలవదు. రిలాక్స్ అవుదామని బాత్ టబ్ లో పడుకుంటే సడెన్ గా ఓ అడవిలో ప్రత్యక్షమవుతుంది. అక్కడ్నుంచి తనను ఎవరో హింసించినట్టు, జాను.. అంటూ మాట్లాడి ఓ వాయిస్ ఓవర్ తో ఆత్మ అని భయపెట్టినట్టు, ఇంట్లోకి, అడవిలోకి సన్నివేశాలు మారిపోవడం, హన్సికని ఇనుప సంకెళ్లతో బంధించడం లాంటి సీన్స్ చూపిస్తారు. సినిమా అంతా హన్సిక తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక నిస్సహాయతగా ఉండి ఆత్మహత్య చేసుకోడానికి కూడా రెడీ అవుతుంది. అసలు హన్సికని ఎవరు అలా బంధించారు? హన్సికతో మాట్లాడే ఆత్మ ఎవరు? హన్సిక తన చుట్టూ ఉన్న ఆ సంఘటనల నుంచి ఎలా బయటపడింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సినిమా మొదటి నుంచి సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ అని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఒక్క పాత్రే రెండు గంటల పాటు సినిమాని నడిపించడం అంత తేలిక కాదు. కానీ హన్సిక చాలా చక్కగా సినిమా అంతా తన భుజాల మీద వేసుకొని నడిపించింది. భయపడుతూ, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న ఓ అమ్మాయిలా హన్సిక బాగా నటించింది. మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా సినిమా నడుస్తుంది. దీంతో అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టొచ్చు. అయితే హారర్ సినిమా కాకపోయినా ఆ రేంజ్ లో ప్రేక్షకులని భయపెడతారు. దీంతో ఆ బోరింగ్ పెద్దగా అనిపించదు. అడవిలోకి, ఇంట్లోకి సన్నివేశాలు మారుస్తూ ఆసక్తిగా కథనం నడిపిస్తారు.

నటీనటులు, సాంకేతిక విషయాలు.. సినిమా మొత్తంలో హన్సిక ఒకటే ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మెప్పించిన హన్సిక పెళ్లి తర్వాత ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ 105 మినిట్స్ సినిమాలో సింగిల్ గా నటించి, సినిమాని నడిపించి ప్రేక్షకులని మెప్పించింది. ఇలాంటి ఓ ప్రయోగాత్మకమైన సినిమా ఒప్పుకున్నందుకు హన్సిక కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.

ఇలాంటి సినిమాకి కెమెరా విజువల్స్ చాలా ముఖ్యం. కిషోర్ బోయిదాపు తన కెమెరా వర్క్ ని, కొత్త కొత్త షాట్స్ ని అద్భుతంగా చూపించాడు. సామ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా మెప్పిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి అడవి, ఇంట్లోకి చేంజ్ అయ్యే సన్నివేశాలన్నిటికి సెట్ వర్క్ పర్ఫెక్ట్ గా చేశారు. ఇక దర్శకుడు సినిమాలో కథ పెద్దగా ఏం లేకపోయినా ఆసక్తికర కథనంతో రెండు గంటల పాటు ఒకే క్యారెక్టర్ తో నడిపించి ఒక కొత్త ప్రయోగం చేశారని చెప్పొచ్చు.

మొత్తంగా సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక భయపడుతూ మనల్ని భయపెడుతుంది. కొత్త ప్రయోగాత్మక సినిమాలు చూసేవాళ్ళు కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభుప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు