గురువారం(ఫిబ్రవరి-14,2019) వాలంటైన్స్ డే రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేసిన డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ తో పాటుగా రాహుల్ గాంధీకి సంబంధిన ఓ ఫొటోని తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోలో రాహుల్ గాంధీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్లుగా ఉంది. అతను రెండో ఆలోచనలు కలిగిఉన్నాడా? అని ఫోటో కాప్షన్ ఇచ్చారు వర్మ.
ఈ ఫొటోపై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ ట్రైలర్ చూసిన తర్వాత చంద్రబాబుని రాహుల్ దూరంపెడతాడని, బాబు నిజస్వరూపాన్ని రాహుల్ కళ్లారా చూస్తున్నాడని, రాహుల్ కి కూడా బాబు వెన్నుపోటు పొడవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాహుల్ ని ఆర్జీవీ తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, వైసీపీ తొత్తుగా ఆర్జీవీ వ్యవహరిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆర్జీవీ విడుదల చేసిన రాహుల్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దశాబ్దాల కాంగ్రెస్ తో వైరం పక్కనబెట్టి బీజేపీని ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ రోడ్ షోలో రాహుల్-బాబు చేతిలో చెయ్యి వేసుకొని తిరగడం, ఢిల్లీ వేదికగా బాబు చేసిన ధర్మపోరాట దీక్షకు రాహుల్ మద్దతివ్వడం తెలిసిందే.