Sai Dharam Tej
Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లాడు. తేజ్ ను వెంటనే హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కోహినూర్ హోటల్ దగ్గర బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, అతి వేగమే ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బైక్ వేగం 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్లు ఉన్నట్టు సమాచారం. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తలకు స్వల్పంగా గాయాలైనట్టు చెబుతున్నారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్‌కు డాక్టర్లు స్కాన్ చేస్తున్నారు. ప్రమాద వార్తను పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ వార్తతో తేజ్ కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.