కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆగస్టులో సినిమా హాళ్లను పున: ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. సినిమా హాళ్ల పున: ప్రారంభంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ చెప్పారు.
ఆగస్టు 1వ తేదీ లేదా ఆగస్టు 31వ తేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను పున: ప్రారంభించాలని తాము సిఫారసు చేశామని కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. సినిమా థియేటర్లలో ఒక వరుస సీట్లను ఖాళీగా ఉంచి సామాజిక దూరం పాటించేలా సినిమా హాళ్లను పున: ప్రారంభించాలని తాము సూచించామన్నారు. రెండు మీటర్ల దూరం పాటించేలా సినిమా హాళ్లు నడపాలని తాము యజమానులతో మాట్లాడతామన్నారు. కేంద్ర కార్యదర్శితో జరిగిన సమావేశంలో సోనీ సీఈవో సం బల్సారా, మెగా టాటా (డిస్కవరి) గౌరవ్ గంధి (అమెజాన్ ప్రైమ్), మనీష్ మహేశ్వరి (ట్విట్టర్), శివకుమార్, కె. మాధవన్ (స్టార్ అండ్ డిస్నీ) లు పాల్గొన్నారు.