Balagam : కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా.
ఓ వైపు పేరు, అవార్డులు వస్తున్నా వివాదాల్లో కూడా నిలుస్తుంది బలగం సినిమా. గతంలో బలగం సినిమా కథ నాది అని ఒకరు వివాదాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఊళ్ళల్లో తెరలు కట్టి బలగం సినిమా వేయడంతో అమెజాన్ దిల్ రాజు మధ్య వివాదం నెలకొంది. తాజాగా బలగం సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. కొంతమంది బలగం సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి(ఏప్రిల్ 10) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ మండల MPTCలు అంతా కలిసి.. బలగం సినిమాలో MPTCలుగా ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలు బాధపెట్టాయి. సినిమాలోని ఇలాంటి సన్నివేశాలతో మా మనోభావాలు దెబ్బ తిన్నాయి. MPTC లను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను సినిమా నుండి తొలగించి, దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల MPTCలు అంతా కలిసి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.