నన్నెంత ట్రోల్ చేశారంటే! : ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ఇలియానా

  • Publish Date - November 25, 2019 / 10:36 AM IST

ఇలియానా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్‌గా రికార్డు నెలకొల్పిన ఈ గోవా బ్యూటీ తన జీవితంలో చాలా కష్టాలున్నాయని, ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది ఇల్లీ బేబీ.

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఇలియానా.. కొన్ని కారణాల వల్ల అతనితో బ్రేకప్ చేసుకుంది. ఊహించని ఈ సంఘటనకు ఇలియానా తట్టుకోలేక పోయిందట. తనకు ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాలు లేక, మరోవైపు వ్యక్తిగత జీవితం గాడి తప్పడంతో చచ్చిపోవడమే మేలని ఆమె భావించిందట.


‘ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని చెబుతోంది ఇలియానా. ఆ పరిస్థితుల్లో నిద్ర కూడా పట్టేది కాదని, నిద్రలేమి వల్లే తాను చాలా బరువు పెరిగిపోయానని తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని, ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారని, కారణం తెలుసుకోకుండా తన ఫిజిక్‌పై ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్ చేయడం తనను బాగా బాధ పెట్టిందని, 13, 14 సంవత్సరాల వయసు నుంచే తన బాడీ అలాగే ఉండేదని, ఎవరెన్ని కామెంట్స్ చేసినా తనకు నచ్చినట్టు తాను ఉంటానాని, ఇలాంటి విషయాల్లో తను చాలా స్ట్రాంగ్’ అని క్లారిటీ ఇచ్చింది..

ఇలియానా  బాలీవుడ్ మూవీ ‘పాగల్ పంతీ’లో నటించింది. గత శుక్రవారం ప్రేక్షకుల ,ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అవకాశం వస్తే తెలుగు సినిమాలు  చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చింది ఇలియానా..