It is not right to criticize CMs comments says Komatireddy Venkat Reddy
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక నుండి బెన్ ఫిట్ షోలు ఉండవన్నారు. సినిమా టికెట్లకు ఎక్స్ ట్రా రేట్లు ఉండవన్నారు. చారిత్రక, స్వతంత్ర పోరాటం, తెలంగాణ గురించి సినిమాలు తీస్తే ప్రభుత్వం నుంచి తప్పక సహకారం ఉంటుందన్నారు. 10టీవీతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంత జరిగినా తాను తప్పు చేయలేదు అని అల్లు అర్జున్ అనడం సరికాదన్నారు. సీఎం అసెంబ్లీలో మాట్లాడింది అబద్దమా..? అని మండిపడ్డారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతనే సీఎం అసెంబ్లీలో మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని, దాన్ని కూడా అల్లు అర్జున్ తప్పుపడతారా ? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.
పోయిన ప్రాణాన్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తారా? మనిషి చనిపోతే వెళ్లొద్దని అంటారా? ప్రాణం అంటే లెక్కలేదా? అని మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాణం పోయిన ఆ తల్లి కొడుకు చేయి వదల్లేదన్నారు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రేవతి కుటుంబాన్ని చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయన్నారు. రేవతి భర్తకు లివర్ ట్రాన్స్ ప్లాంట్ అయిందన్నారు. వారి పిల్లలను ప్రతీక్ ఫౌండేషన్ ఆదుకుంటుందని చెప్పారు.
హీరోలు ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాలన్నారు. త్వరలోనే సినిమా ఇండస్ట్రీతో సమావేశం అవుతామని చెప్పారు. ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి ప్రేమ ఉందన్నారు. చిత్రపురి లో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు.