కాంగ్రెస్ ఎత్తుగడ : రాజకీయాల్లోకి కరీనా కపూర్

ఎన్నికల వేడి రాజుకుంటోంది. పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పబ్లిసిటీతో పాటు ఇమేజ్ పరంగానూ సొమ్ము చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్‌లు నువ్వా నేనా అనే స్థాయిలో అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే పూణె నుంచి మాధురీ దీక్షిత్‌ను ఎంపీగా పోటీ చేయించేందుకు పూనుకుంది బీజేపీ. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులైన గుద్దు చౌహన్, అనీస్ ఖాన్‌లు భోపాల్ ప్రాంతంలో ప్రముఖ బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ సతీమణి కరీనా కపూర్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

భోపాల్ ప్రాంతంలో లోక్ సభ ఎన్నికలలో కరీనా కపూర్ పోటీ చేస్తే తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానానికి సూచించారు. అంతేకాకుండా భోపాల్ నవాబ్ ఇంటి కోడలైన కరీనా కపూర్(సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ భోపాల్ ప్రాంతానికి నవాబ్) కావడంతో మరింత లాభం చేకూరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భోపాల్ నగరంలో పటౌడీ కుటుంబానికి మంచి పేరుంది. సైఫ్ అలీ కుటుంబం తరచూ ఆ నగరానికి వచ్చి వెళ్తుంటారు.

ఈ విషయంపై గుద్దు చౌహాన్, అనీస్ ఖాన్‌లు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ను కలిసి చర్చించనున్నారు. పటౌడి ఇంట్లో రాజకీయాలు కొత్తేం కాదు. కరీనా కపూర్ మావ గారైన మన్సూర్ అలీ ఖానీ పటౌడీ 1991వ సంవత్సరంలో భోపాల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థఇ చంద్రవర్మను లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు.

బీజేపీ అభ్యర్థుల స్పందన:

కరీనా కపూర్ అభ్యర్థిగా నిల్చొంటుందనే విషయంపై బీజేపీ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేకపోవడంతో చివరకు సినిమా వాళ్లతో కూడా పోటీ చేయించి గెలవాలనే ఆశపడుతున్నారన్నారు. స్థానిక నాయకులు లేకపోవడంతో ముంబై నుంచి అభ్యర్థులను దింపి ఎన్నికల్లో పోటీ చేయించాలని కలలుకంటున్నారని విమర్శంచారు.